- స్పీకర్ నిర్ణయాన్ని తిరస్కరించి హైకోర్టు తీర్పునిచ్చింది
- అనర్హత పిటిషన్‌పై సుప్రీంలో దానం లాయర్ వాదనలు
- విచారణను బుధవారానికి వాయిదా వేసిన సూప్రీంకోర్టు
న్యూ ఢిల్లీ, మహా : దానం నాగేందర్ అనర్హత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం రోజున విచారణ చేపట్టనుంది. ఈ మేరకు దానం నాగేందర్ తరఫు న్యాయవాది సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి పిటిషన్‌ను సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం రోజున విచారణ జరపనుంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ పిటిషన్లను కొట్టివేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ వ్యవహారం హైకోర్టుకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. ఈనెల 18వ తేదీన సంచలన తీర్పును వెలువరించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. అదే సమయంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని ఖాళీగా ప్రకటించాలని కూడా ఆదేశించింది.
హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందని దానం నాగేందర్ లాయర్ ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించిన నేపథ్యంలో ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు. దానం నాగేందర్ పై వేటు వేయాలంటూ గతంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు పిటిషన్ దారులు కోరారరని, అయితే స్పీకర్ వారిని పిటిషన్ ను తిరస్కరించారన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిందని పేరకొంటూ పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరారు. దానం నాగేందర్ పిటిషన్‌ను వెంటనే విచారించాలన్న అభ్యర్థనను ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్లు దాఖలు చేసినట్లు తెలిపారు. తమ వాదనలు వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దని వారు కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు బుధవారం పిటిషన్‌ను విచారించనున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు.. పోరాటం తనకు కొత్తేమీ కాదన్న దానం నాగేందర్.. ఒకవేళ ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యం అయితే పోటీ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు తర్వాత తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పిన దానం.. తానొక ఫైటర్ అని.. పోరాడాలని ఆయన సూచించినట్లు తెలిపారు.






