Mahaa Daily Exclusive

  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌….

Share

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.
• నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ‘వన్‌టైమ్‌’ క్లియరెన్స్‌.
• ప్రారంభించని వారి మంజూరు రద్దు.
• నగరంలో వేగంగా ఇందిరమ్మ టవర్ల అడుగులు.
• రాయదుర్గంలో 480 ఫ్లాట్ల నిర్మాణం.
• రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి.
హైదరాబాద్, మహా .
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరై, ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. బేస్‌మెంట్‌ లేదా ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధుల విడుదలలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఎల్‌3 నుంచి ఎల్‌1కు మారుస్తూ ‘వన్‌టైమ్‌ క్లియరెన్స్‌’ (ఒక్కసారికి మాత్రమే ప్రత్యేక అనుమతి) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు. ఈ సడలింపు వల్ల ప్రభుత్వంపై పడే అదనపు ఆర్థిక భారాన్ని తామే భరిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, అర్హులైన పేదలు నిబంధనల వల్ల ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది కేవలం ఈ ఒక్కసారికి మాత్రమే వర్తిస్తుందని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో ఎల్‌3 కేటగిరీ కింద మంజూరయ్యే ఇళ్లకు ఈ సడలింపును ప్రాతిపదికగా తీసుకోబోమని మంత్రి స్పష్టం చేశారు.
నిర్మాణం మొదలుపెట్టకపోతే రద్దే
ఇళ్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పునాది కూడా తీయని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులపై ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. అలాంటి వారి మంజూరును తక్షణమే రద్దు చేసి, ఆ ఇళ్లను అర్హులైన ఇతర నిరుపేదలకు కేటాయించాలని నిర్ణయించింది. ప్రభుత్వ అధికారిక వివరాల ప్రకారం.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొంత భూమి ఉండి శాశ్వత గృహం లేనివారు ఎల్‌1 కేటగిరీలోకి, భూమి, ఇల్లు ఏదీ లేని నిరాశ్రయులు ఎల్‌2 కేటగిరీలోకి వస్తారు. వీరికి ఇళ్ల మంజూరులో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే ఒక శాశ్వత ఇల్లు ఉన్నవారిని ఎల్‌3 కేటగిరీగా పరిగణిస్తారు. కొత్త ఇళ్ల మంజూరుకు వీరు అర్హులు కారు. పాత మంజూరులు రద్దు చేయడం ద్వారా వాస్తవంగా ఇల్లు అవసరమైన పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
తొలిదశలో 4.50 లక్షల ఇళ్లు
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి దశ కింద రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. రెండో దశలో మరో 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
నగరంలో ఇందిరమ్మ టవర్లు
హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఈ టవర్లకు సంబంధించి సెప్టెంబర్‌ 21 నుంచి లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను అందజేస్తున్నట్లు హౌసింగ్‌ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో సుమారు 2.85 ఎకరాల బోర్డు స్థలంలో 480 ఫ్లాట్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న భూమి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.752 కోట్ల నుంచి రూ.767 కోట్ల వరకు ఉంటుందని అంచనా.