Mahaa Daily Exclusive

  గురువులపై దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్…

Share

గురువులపై దాడి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.
* డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదంతో విజయవాడలో ఉద్రిక్తత.
విజయవాడ, మహా
మెగా డీఎస్సీ–2025 స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయుల నియామకాల వ్యవహారం విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. క్రీడా కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం శాప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అదే సమయంలో స్పోర్ట్స్ కోటా కింద ఇప్పటికే ఎంపికైన ఉపాధ్యాయులు సైతం అక్కడికి చేరుకుని, తమపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపుతప్పడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.
ఉపాధ్యాయులపై దాడికి జరిగిన యత్నంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. మూకుమ్మడి దాడులు, నిబంధనల ఉల్లంఘన, పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వంటి అభియోగాలపై మాచవరం, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు లేదా నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఘర్షణలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సీసీటీవీ దృశ్యాలను, పరిసరాల్లోని వీడియోలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈ ఆందోళన మరియు ఘర్షణ వెనుక ముందస్తు ప్రణాళిక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆందోళనకారులు కర్రలు, రాడ్లు, రాళ్లు, కోడిగుడ్లతో అక్కడికి చేరుకున్నట్లు పోలీసు వర్గాల ప్రాథమిక సమాచారం. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు చెందిన కొందరు రౌడీషీటర్లు కూడా ఈ ఘటనలో పాల్గొన్నట్లు ఆరోపణలు వస్తుండటంతో, దర్యాప్తులో వారి పాత్రను కూడా పోలీసులు నిర్ధారించనున్నారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నకిలీ లేదా అనుమానాస్పద క్రీడా ధ్రువపత్రాలు ఉపయోగించారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత ఆగస్టులో ఏపీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఆర్.కె. పురుషోత్తం సైతం అభ్యర్థుల సర్టిఫికెట్లపై ఇలాంటి ఆరోపణలే చేశారు. అయితే, ఈ ఆరోపణలను స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము ప్రతిభ ఆధారంగా, అసలైన క్రీడా పతకాలు, సర్టిఫికెట్లతోనే ఉద్యోగాలు సాధించామని స్పష్టం చేస్తూ శాప్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం బహుళస్థాయి ధ్రువీకరణల అనంతరమే జరిగిందని గతంలోనే శాప్ సైతం అధికారికంగా ప్రకటించింది.
ఉపాధ్యాయ నియామకాల అంశం కాస్తా ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద దాడులకు యత్నిస్తూ ఉద్రిక్తతలు సృష్టించడం సరికాదని అధికార పక్షం అంటుండగా, అవకతవకలను ప్రశ్నించే హక్కు తమకుందని వైసీపీ వాదిస్తోంది. ఈ వివాదంపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అభ్యర్థుల ధ్రువపత్రాలపై అధికారుల విచారణతో పాటు, శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఘర్షణపై పోలీసుల సమగ్ర దర్యాప్తు ముగియాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు హింసాత్మకంగా మారకుండా చూస్తూ, శాంతిభద్రతలు పరిరక్షించడం ఇప్పుడు పోలీసులకు ప్రధాన సవాలుగా మారింది.