Mahaa Daily Exclusive

  వివేకానంద బోధనలతోనే యువతలో వ్యక్తిత్వ వికాసం…

Share

వివేకానంద బోధనలతోనే యువతలో వ్యక్తిత్వ వికాసం.
• భారత ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద.
• విలువలతో కూడిన విద్యే మానవ వికాసానికి పునాది.
• స్వామి బోధమయానంద.

హైదరాబాద్, మహా:

భారతదేశ ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని మాజీ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. యువత స్వామి వివేకానందుని బోధనలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారా వ్యక్తిత్వ వికాసంతో పాటు దేశ నిర్మాణంలోనూ యువత కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ డొమలగూడలోని రామకృష్ణ మఠంలో వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఫౌండేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసభలో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగం భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక భావనకు ప్రతీక అని ఆయన తన ప్రసంగం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు.

సహనం, సర్వమత సమభావం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం భారతీయ సంస్కృతికి మూల సూత్రాలని వివేకానందుడు ప్రపంచానికి తెలియజేశారని ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా మానవత్వాన్ని గౌరవించడం, ప్రతి వ్యక్తిలోని అంతర్గత శక్తిని వెలికితీయడం ఆయన బోధనల ప్రధాన ఉద్దేశమని అన్నారు. మారుతున్న కాలంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ యువతకు అత్యంత అవసరమని తెలిపారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద మాట్లాడుతూ వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు, యువతకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు. విద్యను కేవలం ఉద్యోగం, ఉపాధి సాధించే సాధనంగా చూడకుండా, సంపూర్ణ మానవ వికాసానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే సంస్థ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

విద్యార్థుల్లో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, మానవీయ విలువలను పెంపొందించేందుకు సంస్థ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోందని స్వామి బోధమయానంద వివరించారు. సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధత కలిగిన యువతను తీర్చిదిద్దడం ద్వారా స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఫౌండేషన్ డే వేడుకల్లో నగరానికి చెందిన పలువురు విద్యావేత్తలు, విద్యార్థులు, రామకృష్ణ మఠం భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వివేకానందుని ఆలోచనలు, ఆయన సందేశాలు, యువతపై వాటి ప్రభావంపై కార్యక్రమంలో ప్రసంగాలు, చర్చలు నిర్వహించారు. వేడుకలు ఆధ్యాత్మిక, స్ఫూర్తిదాయక వాతావరణంలో ఘనంగా ముగిశాయి.