ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘాల ఎన్నికలు.
*’ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనంపై నిర్ణయం.
• హైదరాబాద్‌కు 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.
• రిటైర్డ్ కార్మికులకు రూ.1,152 కోట్ల బకాయిలు
• మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మహా:
తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శాసనసభ, శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఆర్టీసీ భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, బస్సుల కొనుగోలు, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశాలపై స్పష్టత ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చారని మంత్రి విమర్శించారు. ఆ సమయంలో ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదని, కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. సంస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఇంకా కార్యాచరణలోకి రాలేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 2023లోనే గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 41 ద్వారా అధికారుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రక్రియ ముందుకు సాగలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ విలీనం తర్వాత ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
ముందుగా ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, అందులో విజయం సాధించిన సంఘాల ప్రతినిధులను విలీన ప్రక్రియకు సంబంధించిన కమిటీలో భాగస్వామ్యం చేస్తామని మంత్రి తెలిపారు. వారి భాగస్వామ్యంతోనే విలీనానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియ కోసం కార్మిక శాఖ ప్రత్యేక అధికారిని నియమించామని, ప్రస్తుతం వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగర ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద త్వరలో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. దీంతో నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలకు ఆధునిక, పర్యావరణహిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.
మరోవైపు 2017 నుంచి 2024 మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన సుమారు 13 వేల మంది ఆర్టీసీ కార్మికులకు రూ.1,152 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఈ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.








