Mahaa Daily Exclusive

  సీఎంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు…

Share

సీఎంతో నాకు ఎలాంటి విభేదాలు లేవు.
• నా మాటలను వక్రీకరిస్తున్నారు.
• మంత్రి పదవిపై హైకమాండ్‌ హామీ ఇచ్చింది.
• రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్, మహా.

“సీఎంను కలిస్తే కాంప్రమైజ్‌ అయ్యానంటారు.. కలవకపోతే గ్యాప్‌ వచ్చిందంటారు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన అంశాలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌: మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో రాజగోపాల్‌రెడ్డి పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తెలంగాణలో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకమని తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. తాను చెప్పిన మాటలను కొన్ని సందర్భాల్లో వక్రీకరించి సీఎం రేవంత్‌రెడ్డితో తనకు విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి ఒక ప్రత్యేకమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ సహించరని మరోసారి స్పష్టం చేశారు.

తనకు మంత్రి పదవి విషయంలో పార్టీ హైకమాండ్‌ నుంచి హామీ ఉందని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ విషయం తన సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కూడా తెలియదని చెప్పారు. మంత్రి పదవికి సంబంధించిన అంశంపై పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకే తాను ఉన్నానని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేశారని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సమష్టి పోరాటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ “నా రాజకీయ భవిష్యత్తుపై నా నోటి నుంచి వచ్చే మాటనే నమ్మాలి” అని అన్నారు. దీంతో తన రాజకీయ భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారానికి ఆయన స్పష్టత ఇచ్చారు.