- ఫీజు బకాయిలు చెల్లించేవరకు పోరాటం ఆగదు.
- రూ.12 వేల కోట్ల బకాయిలతో 20 లక్షల మంది
- విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం.
- నేటి నుంచి రెండు రోజుల నిరాహార దీక్ష.
- బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్ర రావు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యావ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. మొత్తం బకాయిలు రూ.12 వేల కోట్లకు చేరాయని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బకాయిలు పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4 వేల కోట్ల బకాయిలను జోడించిందని రామచందర్‌రావు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో కళాశాలలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, పలుచోట్ల విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి ముందస్తుగా రూ.2 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.
రేపటి నుంచి రెండు రోజుల నిరాహార దీక్ష
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రామచందర్‌రావు ప్రకటించారు. దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. రోడ్డుపై కాకపోతే పార్టీ కార్యాలయ ప్రాంగణంలోనే దీక్ష నిర్వహించి తీరుతామని తెలిపారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
‘మోదీ @ 25’తో నెల రోజుల సేవా కార్యక్రమాలు
ప్రధాని నరేంద్ర మోదీ 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్లు ప్రధానిగా సేవలందించి 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు తెలంగాణలో ‘మోదీ @ 25 సేవా సంకల్ప అభియాన్’ నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.
రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించడంతో పాటు పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ప్రధాని మోదీ రాష్ట్ర నేతలతో నాలుగు గంటల పాటు సమావేశమై పార్టీకి దిశానిర్దేశం చేశారని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సంస్థాగత బలోపేతంపై సూచనలు ఇచ్చారని చెప్పారు.
రాహుల్‌గాంధీకి తెలంగాణలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదు
ఎన్నికల సమయంలో తెలంగాణ విద్యార్థులకు ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో హామీలు ఇచ్చిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని రామచందర్‌రావు ఆరోపించారు. పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీచార్జీలు జరుగుతున్నా, ఆయుష్ విద్యార్థులు స్టైపెండ్ల కోసం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రాహుల్‌గాంధీకి నిజంగా విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌కు వచ్చి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ‘జెన్-జీ’ వంటి పదజాలం అర్బన్ నక్సల్స్, అల్ట్రా లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిందని, దేశంలో ఉన్నది ‘యువ భారత్’ మాత్రమేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ది 30 శాతం కమీషన్ల ప్రభుత్వమంటూ ఆరోపణ
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన, దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన రామచందర్‌రావు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘బ్రదర్స్ సర్కార్’గా మారిందని విమర్శించారు. గతంలో 10 నుంచి 15 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపణలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం ఏకంగా 30 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు.
రియల్ ఎస్టేట్ రంగంలో 22ఏ భూముల పేరుతో బిల్డర్లు, వ్యాపారులను వేధిస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, ఆందోళనలు చేపడుతున్నారని తెలిపారు.
అంతర్గత కలహాలతో కాంగ్రెస్ పతనం ఖాయం
కాంగ్రెస్‌లో అవినీతి కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడంతో ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి, అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయని రామచందర్‌రావు అన్నారు. రహస్య సమావేశాలు జరుగుతున్నాయని, పార్టీ అంతర్గత కలహాలతో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
ప్రజలు ఐదేళ్ల పాలన కోసం అధికారాన్ని అప్పగించినా.. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు చూస్తుంటే ఐదేళ్లు కూడా కొనసాగే పరిస్థితి కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్‌రావు పేర్కొన్నారు.







