Mahaa Daily Exclusive

  ‘వందేమాతరం’ అవమానిస్తే సహించం..! కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్‌..

Share

‘వందేమాతరం’ అవమానిస్తే సహించం.
* కాంగ్రెస్‌ దేశానికి క్షమాపణ చెప్పాలి.
* కాంగ్రెస్‌ అగ్రనేతల వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఫైర్‌.
* విశ్వవిద్యాలయాల్ల దేశ వ్యతిరేక భావజాలంపై తీవ్ర ఆరోపణలు.
హైదరాబాద్‌, మహా.

జాతీయ గేయం ‘వందేమాతరం’ను కాంగ్రెస్‌ పార్టీ అగౌరవపరిచిందని, దీనిపై ఆ పార్టీ అగ్రనాయకత్వం యావత్‌ దేశానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. ‘వందేమాతరం’ 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గేయాన్ని సంపూర్ణంగా ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు వ్యవహరించిన తీరు అత్యంత గర్హనీయమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ను ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రాంచందర్‌రావు ఆరోపించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన జాతీయ గేయాన్ని అవమానించడం క్షమించరాని చర్యగా అభివర్ణించారు. కోట్లాది మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన కాంగ్రెస్‌ నాయకత్వం వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
‘వందేమాతరం’పై రాజకీయ రగడ
దేశ స్వాతంత్ర్య పోరాటంలో ‘వందేమాతరం’ కీలక పాత్ర పోషించిందని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఈ గేయం కోసం ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధులు జైళ్లకు వెళ్లారని, లాఠీ దెబ్బలు, తూటాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అలాంటి చారిత్రాత్మక గేయం పట్ల కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రదర్శించిన వైఖరి దేశ ప్రజలను అవమానించడమేనని అన్నారు.
కాంగ్రెస్‌ నేతల వ్యవహారశైలిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఆ పార్టీ దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.
‘అడవుల్లో నక్సలిజం తగ్గుతుంటే.. నగరాల్లో కొత్త ముప్పు’
దేశంలో నక్సలిజాన్ని అణచివేసే చర్యలు కొనసాగుతున్న సమయంలో నగరాల్లోని కొన్ని విశ్వవిద్యాలయాలను దేశ వ్యతిరేక భావజాలానికి వేదికలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని రాంచందర్‌రావు ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మేధావుల ముసుగులో కొందరు యువతలో దేశ వ్యతిరేక ఆలోచనలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.
అడవుల్లో నక్సలైట్లు ఆయుధాలు వదిలి లొంగిపోతున్నప్పటికీ, నగరాల్లోని కొన్ని వర్గాలు విశ్వవిద్యాలయాలను అడ్డాగా చేసుకుని యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇలాంటి వర్గాలను ‘అర్బన్‌ నక్సల్స్‌’, ‘దిమాగీ నక్సల్స్‌’గా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థి లోకానికి రాంచందర్‌రావు పిలుపు
దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. మేధావుల రూపంలో యువత ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలను విద్యార్థులు గుర్తించాలని సూచించారు.
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసే భావజాలాన్ని విద్యార్థి లోకం తిప్పికొట్టాలని, దేశ సమగ్రతను కాపాడేందుకు యువతరం ముందుండాలని రాంచందర్‌రావు కోరారు. జాతీయ గేయం, జాతీయ సమైక్యత, దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.