Mahaa Daily Exclusive

  పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తా….

Share

పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తా.
• పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను.. భాజపా నాకు ఎన్నో అవకాశాలిచ్చింది.
* ‘ఓట్‌ చోరీ.. సీట్‌ చోరీ’ కాంగ్రెస్‌ పేటెంట్‌.
* ఈసీని బద్నాం చేయడం తగదు.
* కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజం.
కరీంనగర్‌,మహా.
తెలంగాణ భాజపాలో తనకు త్వరలో కీలక బాధ్యతలు అప్పగిస్తారంటూ వస్తున్న ప్రచారాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. భారతీయ జనతా పార్టీ తనకు ఎన్నో ఉన్నతమైన పదవులు, అవకాశాలు కల్పించిందని, తాను ఎన్నడూ పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా ఒక క్రమశిక్షణ గల సైనికుడిలా శిరసావహించి పనిచేస్తానని, నిరంతరం కార్యకర్తగానే పార్టీ అభ్యున్నతికి శ్రమిస్తానని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘సేవా జ్యోతి’ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ భూ వివాదాలపై విచారణలు, చర్యలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ ఒట్టి డ్రామాలేనని కొట్టిపారేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భారీ అవినీతిపై కఠిన చర్యలు తీసుకునే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై నిలదీసే సత్తా బీఆర్ఎస్‌కు లేదని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీల మధ్య తెరవెనుక చీకటి ఒప్పందాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. 2014కు ముందు దేశంలో నెలకొన్న అవినీతి పాలనను, నేటి నవ భారత ప్రగతిని పోల్చి చూసి యువత వాస్తవాలను గ్రహించాలని, విపక్షాల అసత్య ప్రచారాలను నమ్మి మోసపోవద్దని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి కుటుంబం, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాల వ్యామోహం లేదని.. 2047 నాటికి దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దడమే ఆయన ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలను కేంద్ర మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. దేశంలో ‘ఓట్ చోరీ.. సీట్ చోరీ’ అనేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని మండిపడ్డారు. 1946లోనే మెజారిటీ పీసీసీలు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రధాని కావాలని తీర్మానించినప్పటికీ, ఆయనను కాదని నెహ్రూను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు. గతంలో దేశంలో బోగస్ ఓట్లు ఉన్నాయని స్వయంగా కాంగ్రెస్ నేతలే ఆరోపించారని, ఇప్పుడా దొంగ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం సవరణ ప్రక్రియ చేపడితే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించి, అనర్హుల బోగస్ ఓట్లను తొలగించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని వివరించారు.
ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని, అది ఎవరి జేబు సంస్థ కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. అటువంటి ఉన్నత వ్యవస్థలను రోడ్డుకీడ్చి బద్నాం చేయడం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదకరమని హెచ్చరించారు. రాహుల్ గాంధీ నిజంగా సమస్యలు విన్నవించాలనుకుంటే సీఈసీ అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లాలని, అలా కాకుండా వందల మందితో దాడులు చేసేలా ర్యాలీలు నిర్వహిస్తే శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో అక్రమ చొరబాటుదారుల ఓట్లు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించిన ఆయన, ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకు పైగా రోహింగ్యాల ఓట్లు ఉన్నాయని, ఇలాంటి అక్రమాలను అరికట్టడం రాజ్యాంగబద్ధ కర్తవ్యమని పేర్కొన్నారు.