నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి అవినీతి వ్యవహారాలను ఏసీబీ అధికారులు వెలుగులోకి తేవడంతో శాఖలో కలవరం నెలకొంది. అయితే మల్లారెడ్డికంటే ఎక్కువ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మరికొందరు అధికారులు ఉన్నారనే ప్రచారం శాఖలో జోరుగా సాగుతోంది.
శాఖ వర్గాల సమాచారం ప్రకారం, డిప్యూటేషన్‌పై వచ్చిన ఓ ఎస్‌హెచ్‌ఓ పదవిని చేజిక్కించుకునేందుకు పన్నాగాలు పన్ని, తనకు అనుకూలంగా పరిస్థితులు సృష్టించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ పదవిలో కొనసాగుతూ కళ్లుదుకాణాలు, వైన్స్ షాపుల నుంచి భారీ మొత్తంలో మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నందిపేట, నవీపేట, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల పరిధిలోని కళ్లుదుకాణాలు, డిపోలు, వైన్స్ షాపుల నుంచి ప్రతి నెల లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెల్ట్ షాపుల నుంచి కూడా అదనపు ఆదాయం వస్తోందని ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ అండదండల కారణంగా సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడం కష్టమవుతోందని శాఖలో చర్చ నడుస్తోంది.
అదేవిధంగా, కొన్ని వైన్స్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లను నిర్వహిస్తూ బార్ల మాదిరిగా ఆహార పదార్థాలు అందిస్తున్నాయని, దీనివల్ల లైసెన్సు ఫీజులు చెల్లిస్తున్న బార్ యజమానులు నష్టపోతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శాఖలో జరుగుతున్న ఈ వ్యవహారాలపై ఏసీబీ అధికారులు మరింత లోతైన విచారణ చేపడితే మరిన్ని అవినీతి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది








