Mahaa Daily Exclusive

  ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పోలాండ్‌ అండ..!

Share

• ఉగ్రవాదులు ఎక్కడున్నా వెంటాడే హక్కు భారత్‌కు ఉంది.
• పోలాండ్‌ రాయబారి ప్యోటర్‌ ఆంటొనీ స్విటాల్స్కీ.
ఢిల్లీ, మహా.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పోలాండ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా వారిని వెంటాడే హక్కు భారత్‌కు ఉందని పోలాండ్‌ రాయబారి ప్యోటర్‌ ఆంటొనీ స్విటాల్స్కీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి తామూ బాధితులమేనని, అందుకే ఈ విషయంలో భారత్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో సెంటర్‌ ఫర్‌ హోలిస్టిక్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడారు. భారత్‌లో ఉగ్రవాదులు గతంలో అత్యంత భయానక దాడులకు పాల్పడ్డారని, ఈ విషయంలో పోలాండ్‌ ఎప్పుడూ భారత్‌ వైపే ఉంటుందని తెలిపారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వేటాడే హక్కు భారత్‌కు ఉందన్న తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
‘భారత్‌ విషయంలో మా విధానం స్పష్టం’
భారత్‌ ఎదుర్కొంటున్న ఉగ్రవాద ముప్పు విషయంలో తమ దేశ వైఖరి స్పష్టంగా ఉందని స్విటాల్స్కీ అన్నారు. భారత్‌లో జరిగిన ఉగ్రదాడులను పోలాండ్‌ తీవ్రంగా పరిగణిస్తోందని, ఉగ్రవాదంపై పోరులో న్యూఢిల్లీకి అండగా నిలుస్తామని తెలిపారు.
‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పోలాండ్‌కు చెందిన డ్రోన్లను భారత్‌ ఉపయోగించిందన్న వార్తలపైనా ఆయన స్పందించారు. పాకిస్థాన్‌ను తప్పుదోవ పట్టించేందుకు కొన్ని పోలిష్‌ డ్రోన్లను భారత్‌ ఉపయోగించి ఉండవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పాకిస్థాన్‌ను అడ్డుపెట్టుకుని పోలాండ్‌పై విమర్శలు రావడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. దీని వెనుక ఏదైనా విదేశీ ప్రయోజనం లేదా వ్యూహం ఉందా అనే అనుమానం అప్పట్లో తనకు కలిగిందని చెప్పారు.
‘భారత్‌–పోలాండ్‌ భాగస్వామ్యం కీలకం’
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో భారత్‌, పోలాండ్‌లు పలు రంగాల్లో ప్రభావశీల భాగస్వాములుగా ఎదుగుతున్నాయని రాయబారి పేర్కొన్నారు. విచ్ఛిన్నకర శక్తుల ప్రభావంతో ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో స్థిరత్వం, సుపరిపాలనకు భారత్‌, పోలాండ్‌ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా భారత్‌–పోలాండ్‌ మధ్య ఉన్న చారిత్రక అనుబంధాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌కు చెందిన చిన్నారులకు ఆశ్రయం కల్పించిన నవానగర్‌ మహారాజా సర్‌ దిగ్విజయ్‌సింగ్‌జీ జడేజా సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలాండ్‌ ప్రజల హృదయాల్లో ఆయన ఇప్పటికీ మంచి మహారాజుగా గుర్తుండిపోయారని తెలిపారు. ఆయన గౌరవార్థం పోలాండ్‌లోని ఓ కూడలికి పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
భారత్‌, పోలాండ్‌ మధ్య సంబంధాలు కేవలం దౌత్య, ఆర్థిక అంశాలకే పరిమితం కాకుండా చారిత్రక, సాంస్కృతిక అనుబంధంతోనూ ముడిపడి ఉన్నాయని స్విటాల్స్కీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

Latest