Mahaa Daily Exclusive

  అమెరికా గ్రీన్‌కార్డ్‌ ఆంక్షలపై భారత్‌ ఘాటు స్పందన..

Share

  • వలసదారుల సేవలను తక్కువగా చూడొద్దు
  • భారతీయ ఐటీ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలక సహకారులు
  • టాలెంట్‌ మొబిలిటీతో ఇరు దేశాలకూ ప్రయోజనం
  • జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం
  • వలసదారుల సేవలను విస్మరించొద్దని స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మహా : అమెరికాలో ప్రముఖ ఐటీ కంపెనీలకు గ్రీన్‌కార్డ్‌ ప్రాసెస్‌లో కీలకమైన పర్మనెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ (పీఈఆర్‌ఎం) ప్రొగ్రామ్ నిలిపివేయడంపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యాలకు తోడ్పడదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు అక్కడి ఆర్థిక వ్యవస్థ, పరిశోధన, ఆవిష్కరణలకు గణనీయమైన సహకారం అందిస్తున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

టాలెంట్‌ మొబిలిటీ వల్ల భారత్‌తో పాటు అమెరికాకూ ప్రయోజనం కలుగుతుందని భారత్‌ తెలిపింది. భారతీయులకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు.. అమెరికా కంపెనీలకు అత్యాధునిక నైపుణ్యం కలిగిన నిపుణులు అందుబాటులోకి వస్తారని వివరించింది. దీనివల్ల ఆవిష్కరణలు, పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగాల కల్పనకు ఊతం లభిస్తుందని పేర్కొంది. అమెరికాలోని కంపెనీల వాటాదారుల సంపద పెరగడానికీ ఈ నిపుణుల సేవలు దోహదపడతాయని వెల్లడించింది.

పీఈఆర్‌ఎం కార్యక్రమంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలపైనా భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులు ఉన్నత విద్య, ప్రత్యేక నైపుణ్యాలు కలిగినవారని.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, ఆవిష్కరణల రంగానికి విలువైన సేవలు అందిస్తున్నారని విదేశాంగ శాఖ పేర్కొంది. వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను విస్మరించేలా ఉన్నాయని అభిప్రాయపడింది.

అమెరికా చరిత్రలోనూ వలసదారుల పాత్ర కీలకమని భారత్‌ గుర్తుచేసింది. తరతరాలుగా వలస వచ్చిన వారి శ్రమ, వ్యాపార నైపుణ్యం, ఆవిష్కరణలు అమెరికా అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయని తెలిపింది. చారిత్రకంగా, వలస పాలనతో ముడిపడిన బాధాకరమైన అర్థాలు కలిగిన పదజాలాన్ని ఉపయోగించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది.

ఏడు ఐటీ కంపెనీలపై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 8న మైక్రోసాఫ్ట్‌తో పాటు పలు ప్రముఖ సంస్థలను పీఈఆర్‌ఎం కార్యక్రమం నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా, విప్రో, హెచ్‌సీఎల్‌, క్యాప్‌జెమినీ సంస్థలు కూడా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు ఉద్యోగ ఆధారిత గ్రీన్‌కార్డ్‌ పొందే ప్రక్రియలో పీఈఆర్‌ఎం కీలకమైన దశ కావడంతో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కార్యక్రమం ద్వారా విదేశీ ఉద్యోగిని శాశ్వత నివాసం కోసం స్పాన్సర్‌ చేయాలనుకునే సంస్థలు, సంబంధిత ఉద్యోగానికి అర్హులైన అమెరికా కార్మికులు అందుబాటులో లేరని నిర్దిష్ట నిబంధనల ప్రకారం నిరూపించాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం నేపథ్యంలో సంబంధిత కంపెనీల పీఈఆర్‌ఎం దరఖాస్తులపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది కీలకంగా మారింది.

విదేశీ విద్యార్థులు, ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్న సంస్థలపై ట్రంప్‌ ప్రభుత్వం తన పరిశీలనను పెంచుతున్న నేపథ్యంలో ఈ చర్య వెలువడింది. అయితే పీఈఆర్‌ఎం కార్యక్రమంపై తీసుకున్న నిర్ణయాన్ని హెచ్‌-1బీ వీసాల రద్దుగా భావించకూడదు. ఈ రెండు వేర్వేరు ప్రక్రియలు. తాజా పరిణామాలు అమెరికాలో దీర్ఘకాలికంగా స్థిరపడాలని భావిస్తున్న భారతీయ ఐటీ నిపుణుల గ్రీన్‌కార్డ్‌ ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.