ఆకలి కేకల నుంచి అక్షర జాతర వైపు.
* కొడంగల్ బడుల్లో అల్పాహార మహా విప్లవం!
* ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార విప్లవం.
* 60 బడుల్లో 1,525 మంది విద్యార్థులు అదనం.
* హాజరులో 20–22 శాతం పెరుగుదల.
* అల్పాహార పథకానికి ఉపాధ్యాయుల సంపూర్ణ మద్దతు!
కొడంగల్,మహా.
పస్తుల పేగుల స్థానంలో అక్షరాల ఆకలి రాజుకుంటోంది. ఖాళీ కడుపులతో బడిగడప తొక్కే దైన్యం కనుమరుగై, ఉదయం కాగానే అల్పాహారం అమృతంలా ఎదురుచూస్తున్న వేళ తెలంగాణ విద్యావ్యవస్థలో ఓ మహా విప్లవం ఆవిష్కృతమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతతో, హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో రూపుదిద్దుకున్న ఈ బృహత్తర పథకం కొడంగల్ వేదికగా అద్భుత ఫలితాలను సాధిస్తోంది. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ, విద్యార్థుల ఆకలి బాధలను శాశ్వతంగా దూరం చేయడంతో పాటు, వారిని తరగతి గదుల వైపు అయస్కాంతంలా ఆకర్షిస్తూ విద్యా ప్రగతిలో నవశకానికి నాంది పలుకుతోంది.
*బడుల వైపు పరుగులు తీస్తున్న బాల్యం!
ఈ పథకం సృష్టించిన సంచలనం సాధారణమైనది కాదు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల నమోదు ఏకంగా 13 శాతం పెరగడం ఈ పథకం విజయ దుందుభికి సజీవ సాక్ష్యం. కేవలం 60 పాఠశాలల్లోనే ఏకంగా 1,525 మంది విద్యార్థులు అదనంగా చేరడం సర్కారు బడుల కీర్తిని నలుదిశలా చాటుతోంది. వీరిలో 882 మంది బాలురు కాగా, 643 మంది బాలికలు ఉండటం విశేషం. బడి మానేసే దశ నుంచి తిరిగి పుస్తకాలు పట్టే దిశగా విద్యార్థులు వేస్తున్న అడుగులు విద్యావిధానంలో ఒక గొప్ప మార్పును సూచిస్తున్నాయి.
అల్పాహార పథకం అమల్లోకి వచ్చిన నాటినుంచి బడుల్లో విద్యార్థుల కిలకిలరావాలు అనూహ్యంగా పెరిగాయి, హాజరు ఏకంగా 20 నుంచి 22 శాతం వరకు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగిందని 92.8 శాతం మంది తల్లిదండ్రులు, 89.2 శాతం మంది ఉపాధ్యాయులు ధృవీకరించడం ఈ పథకం సాధించిన అపూర్వ విజయం. సమయానికి పాఠశాలకు చేరుకునే వారి సంఖ్య 92.6 శాతానికి చేరడం వారిలోని క్రమశిక్షణకు, బడిపై పెరిగిన మమకారానికి అద్దం పడుతోంది.
తరగతి గదిలో ఆకలి నీరసం ఛాయలు ఇక ఎంతమాత్రం కనిపించడం లేదని ఉపాధ్యాయ లోకం గర్వంగా చెబుతోంది. నూటికి 98.3 శాతం మంది ఉపాధ్యాయులు ముక్తకంఠంతో పిల్లల్లో ఆకలి ఫిర్యాదులు కనుమరుగయ్యాయని స్పష్టం చేయడం ఈ పథకం సృష్టించిన సామాజిక మార్పునకు నిదర్శనం. కడుపు నిండాక పిల్లల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోందని 88.1 శాతం మంది ఉపాధ్యాయులు, విద్యా సామర్థ్యం అద్భుతంగా మెరుగుపడిందని 81.2 శాతం మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం వికసిస్తున్న తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ పథకానికి అసలైన న్యాయనిర్ణేతలైన విద్యార్థులు సైతం బ్రహ్మరథం పడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 99.9 శాతం మంది విద్యార్థులు ఎంతో ఇష్టంగా పాఠశాలలో అల్పాహారాన్ని ఆరగిస్తుండటం గమనార్హం. రుచి, నాణ్యత, పరిశుభ్రత, ఆహారాన్ని వేడిగా అందించే విధానంపై విద్యార్థులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మెనూలో అందించే బోండా-చట్నీని 98.1 శాతం, దోశ-చట్నీని 95.3 శాతం, చిరుధాన్యాల ఇడ్లీ-సాంబార్‌ను 93.6 శాతం మంది అమితంగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, వడ కూడా కావాలని 29.2 శాతం మంది ముద్దుగా అడగటం వారి ఆహారపు ఆనందాన్ని ప్రతిబింబిస్తోంది.
తమ పిల్లలు రోజూ ఉత్సాహంగా బడికి వెళ్తుండటం చూసి మురిసిపోతున్న 96.2 శాతం మంది తల్లిదండ్రులు, ఏకంగా ఈ ప్రభుత్వ పాఠశాలలను ఇతరులకు కూడా గర్వంగా సిఫారసు చేస్తామనడం ఈ బృహత్తర కార్యక్రమంపై వారికి ఉన్న అచంచలమైన నమ్మకానికి ప్రతీక. అల్పాహారం నాణ్యత చాలా బాగుందని 95.7 శాతం మంది తల్లిదండ్రులు కితాబునిస్తున్నారు. పిల్లలు ఇంటికొచ్చాక అల్పాహారం గురించి ఆనందంగా చర్చిస్తున్నారని 97.6 శాతం మంది వివరించడం ఈ పథకం తీసుకువచ్చిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్పష్టం చేస్తోంది.
అద్భుతమైన ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొన్ని నిర్మాణాత్మక సూచనలు కూడా తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆహారంలో నూనె వాడకాన్ని నియంత్రించాలని, తయారీలో నాణ్యతను స్థిరంగా కొనసాగించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. విద్యార్థుల ఎత్తు, బరువు లను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఈ మహా యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగించాలని, మరింత విస్తరించాలని నూటికి నూరు శాతం మంది ఉపాధ్యాయులు పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తున్నారు. సర్కారు బడుల కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేయడంలో ఈ పథకం ఒక సువర్ణాధ్యాయంగా చరిత్రలో నిలిచిపోవడం తథ్యం.








