Mahaa Daily Exclusive

  సేవ్ డెమోక్రసీ…

Share

  • సేవ్ డెమోక్రసీ
  • దేశవ్యాప్తంగా ఆందోళనలు
  • ఢిల్లీలో ఇండియాకూటమి ఎంపీల ప్రార్ధనలు
  • ప్రజాస్వామ్యాన్ని హత్యచేసేందుకు నలుగురి కుట్ర : రాహుల్ గాంధీ
  • హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఛలో లోక్ భవన్
  • బెంగళూరులో కాక్రోచ్ జనతాపార్టీ భారీ నిరసన

(మహా నెట్ వర్క్ )
సేవ్ డెమోక్రసీ ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కోట్లాది ఓట్లు గల్లంతుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సీఈసీపై ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. విపక్ష ఎంపీలు మూడోరోజు ఆందోళనకు దిగారు. రెండురోజుల ఉద్రిక్తతలకు పక్కనబెట్టి మూడోరోజు శాంతియుత ఆందోళన చేశారు. ఢిల్లీ రాజ్‌ఘాట్‌ వేదికగా ఇండీ కూటమి నేతలు నిరసన తెలిపారు. కన్నాట్‌ ప్లేస్‌ నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీగా వచ్చి రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. మోదీ, అమిత్‌ షాకు సద్బుద్ధి కలగాలని రాజ్‌ఘాట్‌ వద్ద నేతలు ప్రార్థనలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ సహా కూటమి ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. గాంధీ తీసుకువచ్చిన స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. స్వాతంత్ర్యంతో పాటు ఓటుహక్కును కాలరాస్తున్నారని విమర్శించారు. రాజ్‌ఘాట్‌ వద్ద ప్రార్థన చేయడానికి వెళ్తున్నామని, స్వాతంత్ర్యం హరించే వారికి సద్బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తామని తెలిపారు.

ప్రజాస్వామ్య హత్యకు నలుగురి కుట్ర : రాహుల్ గాంధీ

300 మంది ఎంపీలం ప్రశాంతంగా ఆందోళన చేయాలనుకుంటున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ తెలిపారు. నిన్న జంతర్‌మంతర్‌ వెళ్లాలని ప్రయత్నించామని అన్నారు. మోదీ, అమిత్‌షా, మోహన్‌ భగవత్‌, జ్ఞానేశ్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు నలుగురు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.

నేడు రాష్ట్రపతితో భేటీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సంఘంపై ఫిర్యాదు చేసేందుకు 15 మంది ఎంపీలతో భేటీ కోరగా.. 10 మంది సభ్యుల ప్రతినిధి బృందానికి రాష్ట్రపతి భవన్‌ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, ఖర్గే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, మమతా బెనర్జీ వంటి ప్రముఖ నేతలు ఈ బృందంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. ఇండియా కూటమి నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. జ్ఞానేశ్‌ కుమార్‌ నివాసం, ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద అదనపు బలగాలను మోహరించారు.

పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి నేతలు చేపట్టి చలో లోక్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు.

బెంగళూరులో ధ్రువ్ రాఠీ, ప్రకాష్ రాజ్, అభిజీత్ దిప్కే

బెంగళూరు లోని ఫ్రీడమ్ పార్క్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన విధానానికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నటుడు ప్రకాష్ రాజ్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేలతో పాటు పలువురు ప్రముఖులు ఒకే వేదికను పంచుకున్నారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పీపుల్స్ ట్రిబ్యునల్‌లో పాల్గొన్న ప్రసంగీకులు ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, వేదిక ముందున్న నిరసనకారులతో ‘నరేంద్ర మోదీ వోట్ చోర్’ అంటూ నినాదాలు చేయించారు. దేశంలో ఓటర్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ నిరసన వేదికపై ధ్రువ్ రాఠీ, విలేకరి జుబేర్, అభిజీత్ దిప్కేలు కలిసి కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల సభ్యులు, వామపక్ష యువజన విభాగాలు పాల్గొన్నాయి.