కోట్లాది భారతీయుల నమ్మకమే నా అసలైన బలం.
* ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల నిరంతర ప్రస్థానం.
* ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు.
* ప్రధాని మోదీ.
* ఢిల్లీ వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు.
* 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధన దిశగా పునరంకితం.
న్యూఢిల్లీ, మహా.
రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగుతూ పాతికేళ్ల పాటు నిరంతరాయంగా దేశ ప్రజలకు సేవ చేస్తానని ప్రారంభంలో తాను ఎన్నడూ ఊహించలేదని, కోట్లాది మంది భారతీయులు తనపై ఉంచిన అచంచల విశ్వాసమే తన అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రజలు అందించిన నిరంతర ఆశీర్వాదం, భరోసా వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొంటూ దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రభుత్వాధినేత హోదాలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలతో తనకున్న పేగుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని బుధవారం ఉదయం ఆయన దేశ రాజధానిలోని సరోజినీ నగర్లో ఉన్న శ్రీ వినాయక మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, విఘ్నహర్త ఆశీస్సులతో భారతదేశం నిరంతర ప్రగతి పథంలో పయనించాలని ప్రార్థించినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నాటి క్షణాలను మోదీ నెమరువేసుకున్నారు. అప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోయినా, కేవలం పార్టీ సంస్థాగత కార్యకర్తగానే కొనసాగినప్పటికీ ప్రజా జీవితంలో అనూహ్యంగా అత్యున్నత బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందన్నారు. తన వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా, దేశ సేవ అనే ఒక పవిత్ర సంకల్పం కోసమే జీవితాన్ని ధారపోయాలన్నదే తన చిన్ననాటి సంస్కారమని స్పష్టం చేశారు. గుజరాత్ సీఎంగా వరుస విజయాలు సాధించిన అనంతరం 2014లో ప్రధాని బాధ్యతలు స్వీకరించి, నేడు వరుసగా మూడో పర్యాయం దేశాన్ని ముందుకు నడిపిస్తున్నానని తెలిపారు. ఈ 25 ఏళ్ల ప్రస్థానాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన మనస్సులో కేవలం కృతజ్ఞతా భావమే మిగులుతుందని, తన విజయాల్లో బీజేపీ కార్యకర్తల నిరంతర శ్రమ, దేశ ప్రజల ఆశీస్సులు కీలక పాత్ర పోషించాయని కొనియాడారు. గెలిపించిన వారు వినమ్రతను నేర్పితే, ఎదురైన ఆటుపోట్లు తిరిగి నిలబడే స్థైర్యాన్ని ఇచ్చాయని, విమర్శకులు తనను తాను మరింత మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు.
భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ దేశ సేవకే జీవితాన్ని అంకితం చేసిన స్వయంసేవకులు, కోట్ల మంది కార్యకర్తల నిబద్ధత తనకు అండగా నిలిచిందని మోదీ చెప్పారు. వారి నిస్వార్థ సేవలను స్మరించుకుంటూ ప్రతి స్వయంసేవకుడికి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సేవలో గడిపిన ఈ పాతికేళ్ల అనుభవం కేవలం మోదీ వ్యక్తిగత ఆస్తి కాదని, అది యావత్ భారత దేశానికి చెందిన అమూల్యమైన సంపద అని అభివర్ణించారు. తాను ఇప్పటికీ నిరంతర విద్యార్థినేనని, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ దేశ ప్రగతికి మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని వెల్లడించారు.
గతంలో ఉగ్రవాద బెదిరింపులతో సతమతమైన భారతదేశం నేడు అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోందని, ఈ ప్రగతి రథాన్ని ఎవరూ ఆపలేరని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించి తీరడమే తమ పరమ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడం, కీలక రంగాల్లో పూర్తి స్వావలంబన సాధించడం, అంతర్జాతీయ తయారీ రంగానికి భారత్‌ను కేంద్రంగా మార్చడం, ఒలింపిక్ క్రీడలను స్వదేశంలో విజయవంతంగా నిర్వహించడంతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త శిఖరాలను అధిరోహించడమే రాబోయే కాలంలో దేశం ముందున్న ప్రధాన లక్ష్యాలని మోదీ వివరించారు. భవిష్యత్ సంకల్పాలకు పునరంకితం కావడానికి ఈ సందర్భం మరింత స్ఫూర్తినిస్తుందని ఆయన స్పష్టం చేశారు.







