కాలుష్య నియంత్రణకు సమగ్ర కార్యాచరణ.
*పీయూసీ ముగిస్తే ఆటోమేటిక్ చలాన్లు.
* 13 కొత్త వాయు పర్యవేక్షణ కేంద్రాలు.*
హైదరాబాద్, సంగారెడ్డిలలో తగ్గిన పీఎం10 స్థాయిలు.
హైదరాబాద్,మహా:
రాష్ట్రవ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని అరికట్టి, స్వచ్ఛమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. వాయు నాణ్యతపై శాస్త్రీయ పర్యవేక్షణ, కాలుష్య ఉద్గారాల మూలాల గుర్తింపు, ఆయా శాఖల సమన్వయంతో తీసుకోవాల్సిన చర్యలపై ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది. వాయు కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ఆధ్వర్యంలో బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
క్షేత్రస్థాయిలో తీసుకున్న దిద్దుబాటు చర్యల వల్ల కాలుష్య తీవ్రతలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో గతంలో నమోదైన పీఎం10 (ధూళికణాల) స్థాయి 86 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల నుంచి 80కి, సంగారెడ్డిలో 87 నుంచి 78కి గణనీయంగా తగ్గింది. అయితే, నల్గొండలో ఈ స్థాయి 59 నుంచి 71కి పెరగడంతో అధికారులు అక్కడ ప్రత్యేక దృష్టి సారించారు. కాలుష్య తీవ్రతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘క్యూర్’ పరిధిలో కొత్తగా 13 నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల (CAAQMS) ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ప్రజలకు, అధికారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ‘ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డు’ను రూపొందిస్తున్నారు. ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినప్పుడు తక్షణమే సంబంధిత శాఖలను అప్రమత్తం చేసేందుకు ఎస్ఎంఎస్ అలర్ట్ వ్యవస్థను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో 8 తక్కువ వ్యయంతో కూడిన సెన్సార్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
నగరాలు, పట్టణాల్లో రోడ్డు ధూళిని నియంత్రించేందుకు మెకానికల్ రోడ్ స్వీపింగ్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు. రాష్ట్రంలోని 516 పీయూసీ కేంద్రాలను ఇప్పటికే కేంద్ర సర్వర్‌తో అనుసంధానించారు. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 36.14 లక్షల వాహనాలకు పీయూసీ పరీక్షలు నిర్వహించగా, గడువు ముగిసిన వాహనాలకు నేరుగా ఆటోమేటిక్ చలాన్లు విధించేలా సరికొత్త సాంకేతిక వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రాజధానిలో ఇప్పటికే 310 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. భారీ డీజిల్ జనరేటర్ల నుంచి వెలువడే పొగను నియంత్రించేందుకు ఆర్ఈసీడీ పరికరాల అమరికను తప్పనిసరి చేస్తున్నారు.
కాలుష్యానికి దారితీస్తున్న నిర్దిష్ట కారణాలను శాస్త్రీయంగా గుర్తించేందుకు నల్గొండ, సంగారెడ్డిలలో సోర్స్ అపార్షన్‌మెంట్ స్టడీ (SAS)తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉద్గారాల సమగ్ర వివరాల సేకరణ (ఎమిషన్ ఇన్వెంటరీ) చేపట్టనున్నారు. వ్యవసాయ వ్యర్థాలను బహిరంగంగా తగులబెట్టడం వల్ల తలెత్తే అనర్థాలపై రైతుల్లో అవగాహన పెంచడంతో పాటు, ఆ వ్యర్థాలతో బయోమాస్ బ్రికెట్లు, పెల్లెట్ల తయారీని ప్రోత్సహించనున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు గాను జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద 2026–27 ఆర్థిక సంవత్సరంలో నల్గొండ, సంగారెడ్డి జిల్లాలకు రూ.7.25 కోట్ల నిధులను కేటాయించారు. స్వచ్ఛ వాయు సర్వేక్షణలో నల్గొండ 16వ వార్డు జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించి రూ.20 లక్షల నగదు బహుమతిని దక్కించుకోగా, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, గన్‌ఫౌండ్రీ వార్డులకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. భవిష్యత్తులో వాహన, గృహ కాలుష్యాన్ని మరింతగా తగ్గించేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) నెట్‌వర్క్‌ను శరవేగంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.








