విజయవాడ, మహా:
నగర పరిధిలో విదేశీయులకు బస కల్పించే హోటళ్లు, లాడ్జీలు, విద్యాసంస్థలు, ఇతర వసతి గృహాల నిర్వాహకులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) రాజశేఖర్ బాబు ఆదేశించారు. విదేశీయులు తమ వద్దకు వచ్చినప్పుడు విధిగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. విదేశీయులు వసతి పొందిన 24 గంటల్లోగా వారి పూర్తి వివరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.
వసతి కల్పించిన వెంటనే ఆయా వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్ ‘indianfrro.gov.in’ వెబ్సైట్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సీపీ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. విదేశీయుల వసతి, వివరాల నమోదు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. అలాగే, చట్టప్రకారం 2 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని సీపీ హెచ్చరించారు. జాతీయ భద్రత, స్థానిక శాంతిభద్రతల దృష్ట్యా నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.








