అమరావతి, మహా:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రజా సంక్షేమం, వైద్యారోగ్య రంగాల బలోపేతం, విద్యాభివృద్ధి, పరిపాలనా సంస్కరణలే లక్ష్యంగా మొత్తం 12 అజెండా అంశాలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. మంత్రివర్గంలో చర్చించిన అంశాలు, తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ, ఆయన తెచ్చిన సంస్కరణలను కొనియాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసిందని మంత్రి తెలిపారు.
వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. విధి నిర్వహణలో ఉండగానే మరణించిన అర్హత కలిగిన ఆశా (ASHA) కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వారు అందించిన ప్రతి ఏటా సేవకు రూ.5 వేల చొప్పున గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు గ్రాట్యుటీ అందించాలని నిర్ణయించారు. దీనితో పాటు బాపట్ల జిల్లా రేపల్లెలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను (సీహెచ్‌సీ) అత్యాధునిక వసతులతో కూడిన 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు అవసరమైన రూ.58.42 కోట్ల నిధులతో పాటు అదనంగా 66 ఉద్యోగ పోస్టుల మంజూరుకు అనుమతులు మంజూరు చేసింది.
పాఠశాల, ఉన్నత విద్యా రంగాల్లో సమూల మార్పులు తెచ్చేలా పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం పలికింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘తల్లికి వందనం’ పథకం మార్గదర్శకాలు, పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం రాటిఫికేషన్ ఇచ్చింది. అదనంగా మరో 58,060 మంది విద్యార్థులను చేర్చడంతో ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య ఏకంగా 68,57,880కి చేరింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల డైట్ ఛార్జీల పెంపునకు సంబంధించిన గత ఉత్తర్వులను మంత్రివర్గం ఆమోదించింది. విశాఖపట్నం మరికవలసలో గిరిజన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలైన ఐఐటీ-జేఈఈ, నీట్‌లకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థుల సిలబస్‌ను నిరంతరం పర్యవేక్షించేలా ఏపీ విద్యా చట్టం-1982కు సవరణలు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిష్టాత్మక విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల స్థాపనను ప్రోత్సహించే సరికొత్త విధానం ‘నూతన పాలసీ-2026’కు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
ఉద్యాన రంగానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించే లక్ష్యంతో రూ.20.62 కోట్ల వ్యయంతో 72 నెలల పాటు అమలు చేసేందుకు ‘ఏపీ హార్టికల్చర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రజా ప్రయోజనార్థం పలు భూ కేటాయింపులకు సైతం ఆమోదం లభించింది. కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కుడా) అధికారుల అతిథి గృహం కోసం 1.69 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు, వైఎస్సార్ కడప జిల్లా పాతూరులోని ఆలయ అభివృద్ధికి 7.66 ఎకరాల ప్రభుత్వ భూమిని దేవాదాయ శాఖకు బదలాయించేందుకు, ప్రకాశం జిల్లా కొండపిలో బాలుర రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్ నిర్మాణం నిమిత్తం 7 ఎకరాల భూమి వర్గీకరణ మార్పునకు ఆమోదం లభించింది. గ్రామాల నుంచి నగరాలకు వలస వచ్చిన పేదలు నివాసముంటున్న ప్రభుత్వ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమానికి అనుగుణంగా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని అభ్యంతరం లేని ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ ఉత్తర్వులకు ఏపీ మంత్రివర్గం రాటిఫికేషన్ ఇచ్చింది.








