Mahaa Daily Exclusive

  స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ…

Share

స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ.
* ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు.
* తమ వాదనలు వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని విజ్ఞప్తి.
* హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైకాపా పిటిషన్.
న్యూఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న న్యాయ వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. స్థానిక సమరానికి రంగం సిద్ధం చేస్తున్న వేళ, ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామంతో అప్రమత్తమైన రాష్ట్ర కూటమి ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని, తమ వాదనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తగిన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఇంకా పూర్తికాకుండానే స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తొందరపడుతోందని వైకాపా తన పిటిషన్‌లో ఆరోపించింది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఏడాది జనవరి నాటి పాత ఓటర్ల జాబితా డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఎన్నికలకు వెళ్లడం సమంజసం కాదని వాదించింది. అయితే, ఇదే అంశంపై గతంలో ఏపీ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై అక్టోబరు 1న కీలక తీర్పు వెలువడింది. వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసుకుని, స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. హైకోర్టు ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైకాపా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఏపీలో ప్రభుత్వం ఏ క్షణంలోనైనా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నందున, ఈ పిటిషన్‌పై తక్షణమే అత్యవసర విచారణ చేపట్టాలని వైకాపా తరఫు న్యాయవాది భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. ఈ విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఇదే సమయంలో ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్న న్యాయమూర్తి జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేస్తూ, మున్సిపాలిటీ సరిహద్దుల ఫ్రీజింగ్ నిబంధన వార్డులకు వర్తించదని, వార్డుల సరిహద్దులు ఫ్రీజ్ కావని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పాలనను గాడిన పెట్టేందుకు స్థానిక ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం న్యాయపరంగా అడ్డంకులు సృష్టించకుండా ముందుజాగ్రత్త చర్యగా ఈ కేవియట్‌ను దాఖలు చేసింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం కేవియట్ దాఖలు చేయడంతో, ఈ అంశంపై తదుపరి విచారణ ఏ మలుపు తిరుగుతుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.