Mahaa Daily Exclusive

  మహిళా సాధికారతకు సరికొత్త వేదికలు…

Share

మహిళా సాధికారతకు సరికొత్త వేదికలు.
• జిల్లాల్లో సర్వాంగ సుందరంగా ఇందిరా మహిళా శక్తి భవనాలు.
• కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.
• సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్, మహా:
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత, స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పకడ్బందీ అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ‘మహిళా శక్తి’కి సరికొత్త వేదికలు రూపుదిద్దుకున్నాయని, జిల్లాల వారీగా నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభానికి ముస్తాబైన ‘ఇందిరా మహిళా శక్తి భవనాలు’ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు సరికొత్త నిలయాలుగా మారబోతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మహిళా సాధికారతపై ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరిస్తూ ముఖ్యమంత్రి బుధవారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఒక ఆడబిడ్డకు సరైన అవకాశం కల్పిస్తే, ఆ కుటుంబం భవిష్యత్తే పూర్తిగా మారిపోయి ప్రగతి పథంలో పయనిస్తుందని సీఎం ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను కేవలం పొదుపుకే పరిమితం చేయకుండా, వారిని విజయవంతమైన పారిశ్రామిక, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో సుమారు రూ.110 కోట్ల వ్యయంతో ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రభుత్వం నిర్మించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో జిల్లా కేంద్రంలో రూ.5 కోట్ల ఖర్చుతో, సుమారు 15 వేల చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో సర్వ హంగులతో ఈ భవనాలను తీర్చిదిద్దారు. ఇవి మహిళలకు అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, వ్యాపారాభివృద్ధి, ఉత్పత్తుల తయారీతో పాటు వారు తయారు చేసిన వస్తువులను గ్లోబల్ మార్కెట్లలో విక్రయించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ఒకే వేదికపై అందించే కీలక కేంద్రాలుగా నిలవనున్నాయని రేవంత్‌రెడ్డి వివరించారు. జిల్లా మహిళా సమాఖ్యల కార్యకలాపాలకు ఈ భవనాలు ఇకపై శాశ్వత చిరునామాగా మారనున్నాయి.
రాష్ట్రంలో మహిళలకు అవకాశాలు పెరిగితేనే తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ అనే మహత్తర ఆశయంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ బృహత్తర లక్ష్య సాధన దిశగా ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు మరింత ఊతమిస్తూ, తెలంగాణ ప్రగతి ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని వేగవంతం చేయడంలో ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలు మైలురాయిగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.