Mahaa Daily Exclusive

  ఈసీ విధానాలపై రాజీలేని పోరాటం…

Share

ఈసీ విధానాలపై రాజీలేని పోరాటం.
• సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి.
• ఈడీ, సీబీఐ తరహాలోనే ఎన్నికల సంఘం దుర్వినియోగం.
• సీఎం రేవంత్‌రెడ్డి.
న్యూఢిల్లీ,మహా.

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ, కేంద్ర ఎన్నికల సంఘం వైఖరికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని, వీటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ‘ఇండియా’ కూటమి రాజీలేని పోరు సాగిస్తుందని తేల్చిచెప్పారు.
ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను విడుదల చేయగా, విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. సంఘీభావం తెలిపిన అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. దేశంలో ప్రతిపక్షాల ఐక్యతను చూసి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర అసహనానికి లోనవుతున్నారని విమర్శించారు. గత కొన్నేళ్లుగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘాన్ని కూడా రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన పౌరుల ఓట్లను ఎన్నికల సంఘం అకారణంగా గల్లంతు చేసిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును కాలరాసే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రజాక్షేత్రంలో గట్టిగా ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.