Mahaa Daily Exclusive

  అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా ఈసీ ప్రత్యేక డ్రైవ్….

Share

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా ఈసీ ప్రత్యేక డ్రైవ్.
* గల్లంతైన ఓటర్లు, యువతపై ప్రత్యేక దృష్టి.
* బూత్ స్థాయి అధికారులకు కీలక బాధ్యతలు.
న్యూఢిల్లీ, మహా .
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చుట్టూ దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయంటూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో, ఎలాంటి లోపాలకు తావులేకుండా అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సవరణ ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త ఓటర్ల నమోదుతో పాటు, జాబితాలో చోటు దక్కని వారి కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ప్రధానంగా ఈ సమగ్ర సవరణ ప్రక్రియకు ముందు జాబితాలో పేరు ఉండి, తాజా సవరణ తర్వాత పేర్లు కనిపించని అర్హులైన వ్యక్తులను ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నిశితంగా గుర్తించనున్నారు. సాంకేతిక కారణాలు లేదా పొరపాట్ల వల్ల ఓటు హక్కు కోల్పోయిన పౌరులకు ఇది ఒక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. దీనికి తోడు కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతీయువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే సవరణ ప్రక్రియ పూర్తయిన దాదాపు 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని తక్షణమే అమలు చేయాలని ఈసీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారుల (బీఎల్‌ఓ) పాత్ర అత్యంత కీలకం కానుంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అంచనా వేసే బాధ్యతను ఈసీ వారికి అప్పగించింది. బీఎల్‌ఓలు పాత, కొత్త ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పోల్చి చూసి, గతంలో ఉండి ప్రస్తుతం గల్లంతైన వారి వివరాలను పక్కాగా సేకరిస్తారు. అవసరమైన పక్షంలో ఇంటింటికీ తిరిగి వ్యక్తిగతంగా వివరాలను ధ్రువీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో సదరు వ్యక్తి ఓటు హక్కుకు అర్హుడని తేలితే, అక్కడికక్కడే ఫారం-6 దరఖాస్తును పూర్తి చేయించి జాబితాలో పేరు చేర్చేలా సహకరిస్తారు.
ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈసీ బీఎల్‌ఓలకు నిర్దిష్ట లక్ష్యాలను సైతం నిర్దేశించింది. ఒక్కో అధికారి వారానికి కనీసం 20 నుంచి 25 మంది ఓటర్ల వివరాలను పరిశీలించాలని, ఈ మొత్తం కార్యక్రమాన్ని కేవలం నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదును మరింత సులభతరం చేసేందుకు, ప్రజల సౌలభ్యం కోసం బూత్ స్థాయి శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించింది.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న విషయం విధితమే. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా గత రెండు రోజులుగా ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఈ క్రమంలో రాజకీయ విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచే ఉద్దేశంతోనే ఎన్నికల సంఘం ఈ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.