Mahaa Daily Exclusive

  తెలంగాణలో అధిక ప్రమాదాలున్న 7 జిల్లాలపై ప్రత్యేక దృష్టి..

Share

  • తెలంగాణలో అధిక ప్రమాదాలున్న 7 జిల్లాలపై ప్రత్యేక దృష్టి
  • రోడ్డు ప్రమాదాలపై ‘జీరో ఫాటాలిటీ’ లక్ష్యం
  • ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం
  • ఈ -డార్ లో ప్రమాదాల సమగ్ర నమోదు

హైదరాబాద్‌, మహా : రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఏడు జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా జిల్లాల్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి, మరణాలను తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై డీజీపీ సీవీ ఆనంద్‌ , రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి సంయుక్తంగా
బుధవారం డీజీపీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో సేఫ్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, ఎంపిక చేసిన ఏడు జిల్లాల కలెక్టర్లు, నాలుగు పోలీస్ కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు, సంబంధిత యూనిట్‌ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ప్రమాద స్థలాలపై సమగ్ర విశ్లేషణ

ప్రతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాదాలకు దారితీస్తున్న కారణాలు, ఏ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్న అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మార్గదర్శక్ పోర్టల్‌, డ్యాష్‌బోర్డులో నమోదు చేయాలని డీజీపీ సూచించారు. అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించడం ద్వారా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

దేశంలో ఏటా 1.75 లక్షల మంది మృతి

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 1.75 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని డీజీపీ తెలిపారు. తెలంగాణలో ఏటా సుమారు 7 వేల మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల మరణాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో ఉందన్నారు. ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో రోడ్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికి సంబంధించి త్వరలో జీవో వెలువడుతుందని వెల్లడించారు.

ఏడు జిల్లాల్లో 48 కీలక రోడ్డు ప్రమాద కారిడార్లు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ప్రత్యేక జిల్లా రోడ్డు భద్రతా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. సేఫ్‌లైఫ్ ఫౌండేషన్ రూపొందించిన ఈ ప్రణాళికల్లో 2024, 2025 ఈ డార్ గణాంకాల ఆధారంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో 48 కీలక ప్రమాద కారిడార్లు, నాలుగు లేదా అంతకంటే ఎక్కువ మరణాలు నమోదైన 230 ప్రాధాన్య-1 ప్రాంతాలు, 220 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 183 కీలక పాదచారుల ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. ఇందులో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 14 కీలక కారిడార్లు, రంగారెడ్డిలో 98 ప్రాధాన్య ప్రమాద ప్రాంతాలు, 99 ట్రాఫిక్ ఉల్లంఘన ప్రాంతాలు, 66 పాదచారుల ప్రమాద ప్రాంతాలు ఉన్నట్లు కార్యాచరణ ప్రణాళిక వెల్లడించింది. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలు, సమయాలు, రహదారి నిర్మాణం, ఇంజినీరింగ్‌ లోపాలు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

‘4ఈ’ విధానంతో ప్రమాదాల కట్టడి

రోడ్డు ప్రమాదాల నివారణలో ‘4ఈ’ విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందులో ఎడ్యుకేషన్‌, ఇంజినీరింగ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎమర్జెన్సీ సపోర్ట్‌ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు, ప్రమాదాలకు కారణమయ్యే రహదారి లోపాలను గుర్తించి సరిదిద్దాలని సూచించారు.

‘ఈ-డార్‌’ లో ప్రమాదాల నమోదు

రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రతిసారీ ఎలక్ట్రానిక్‌ డిజిటల్‌ యాక్సిడెంట్‌ రిపోర్ట్‌ (ఈ-డార్‌) నమోదు చేయాలని రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి అధికారులకు సూచించారు. మార్గదర్శక్ పోర్టల్‌లో ప్రమాదాలు, గాయపడిన వారి వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాలని వివరించారు. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల జియో ట్యాగ్‌ ఫొటోలను కూడా మార్గదర్శక్ పోర్టల్‌ డ్యాష్‌బోర్డులో నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ విధానాలను ఈ సందర్భంగా వివరించారు.

నవంబరు 3న చెన్నైలో ప్రజెంటేషన్‌

నవంబరు 3న చెన్నైలో జరగనున్న సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలు, రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలు మరణాలు ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, భవిష్యత్‌ ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ ఆదేశించారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ.. ప్రమాదాల సంఖ్య, ముఖ్యంగా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిజిపి సూచించారు.