Mahaa Daily Exclusive

  తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వైఎస్ షర్మిల…

Share

  • తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసిన వైఎస్ షర్మిల
  • కుమార్తె అంజలిరెడ్డి వివాహానికి ఆహ్వానం
  • విజయవాడ ఉత్సవ్ కు రావాలంటూ విజయ్ ను కలిసిన టీడీపీ ఎంపీలు

చెన్నై, మహా : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు పర్యటనలో ఉన్నారు. చెన్నైలో ఆమె భర్త అనిల్‌తో కలిసి తమిళనాడు సీఎం విజయ్‌తో భేటీ అయ్యారు. వైఎస్ షర్మిల తన కుమార్తె అంజలి రెడ్డి వివాహ మహోత్సవానికి విజయ్‌ను ఆహ్వానించారు. వైఎస్ షర్మిల దంపతులు ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. విజయ్‌ను కలిసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకకు విజయ్‌ను ఆహ్వానించామని షర్మిల తెలిపారు. తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందించినట్లు పేర్కొన్నారు. విజయ్ కుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరానన్నారు.

వైఎస్ షర్మిల కొద్దిరోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. రాజకీయ నేతల్ని తన కుమార్తె వివాహానికి ఆహ్వానిస్తున్నారు. ఆమె తమిళనాడు పీసీసీ కార్యాలయాన్ని సందర్శించారు. అలాగే తమిళనాడుపీసీసీ చీఫ్, ఎంపీ మాణిక్కం ఠాగూర్‌‌ను కలిసి కుమార్తె వివాహ ఆహ్వానపత్రికను అందజేశారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలతో పాటుగా ఇతర పార్టీల నేతల్ని స్వయంగా కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు షర్మిల. వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహం నిశ్చయమైంది. సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నవంబర్ 25న అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డిల వివాహ వేడుక జరగనుంది. తన కుమార్తె వివాహ వేడుకకు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖుల్ని షర్మిల ఆహ్వానిస్తున్నారు.

విజయ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు

మరోవైపు టీడీపీ ఎంపీలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను కలిశారు. విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అమలాపురం ఎంపీ జీఎంసీ హరీష్ బాలయోగి, విజయవాడ ఉత్సవ్ కమిటీ ఛైర్మన్ మురళిలు విజయ్‌ను కలిసినవారిలో ఉన్నారు.