*చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుంది
*పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం
*3 లక్షల ఇళ్ల నిర్మాణానికి తొలి విడత నిధులు – అవసరమైతే మరో 3 లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం
*3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో వేగంగా, తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం
బుర్రిపాలెం/గుంటూరు, మహా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
తెనాలి రూరల్ బుర్రిపాలెం గ్రామంలో గృహ నిర్మాణ రంగంలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణ పైలెట్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి తో కలసి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమర్థవంతమైన నాయకత్వం, అభివృద్ధి పట్ల నిబద్ధతను ప్రశంసించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైనమిక్, నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రతీక అని కేంద్ర మంత్రి కొనియాడారు. భవిష్యత్ భారతదేశానికి సాంకేతికతే ప్రధాన బలమని ముందుగానే గుర్తించి ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, అధునాతన తయారీ రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు.
అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపుతున్న దూరదృష్టి తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. ఆయన విజన్, కృషి, నిబద్ధతను చూస్తుంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందన్న నమ్మకం కలుగుతోందన్నారు.
*పెమ్మసాని చంద్రశేఖర్ సేవలు అభినందనీయం*
బుర్రిపాలెం డాక్టర్ పెమ్మాసాని చంద్రశేఖర్ స్వగ్రామం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిగా గ్రామీణాభివృద్ధి, ప్రజా సమస్యలను ఎంతవరకు అర్థం చేసుకుంటారోనని మొదట అనుకున్నానని, అయితే ఆయనలోని స్పష్టత, నిబద్ధత, ప్రజలతో అనుబంధం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. ఇలాంటి ప్రతిభావంతులను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అభినందించారు. ప్రజలకు సేవ చేయడం భగవంతుడిని పూజించడంతో సమానమని, తాము ప్రజల సేవకులుగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
*పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తాం*
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను సక్రమంగా వినియోగించి ఉంటే రాష్ట్రంలోని పేదల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తొలుత 76 వేల ఇళ్లకు మాత్రమే అనుమతించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే ఆశయానికి అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ పేదల కోసం 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేశామన్నారు. అలాగే ప్రస్తుతం 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన అనంతరం మరో 3 లక్షల ఇళ్లు, అవసరాన్ని బట్టి తదుపరి విడతల్లో మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలందరికీ ఇళ్లు నిర్మించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
*3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం*
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించనున్న ఇళ్లలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ముఖ్యంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ఇళ్లను నిర్మించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సాంకేతికత ద్వారా ఇళ్ల నిర్మాణ సమయం తగ్గడంతో పాటు నిర్మాణ వ్యయం తగ్గుతుందని, తక్కువ మానవ వనరులతో నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. నిర్మాణాల నాణ్యత, మన్నిక కూడా మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరు నెలల వ్యవధిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఈ సాంకేతికతను వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.








