Mahaa Daily Exclusive

  సినీ లోకంలో మూగబోయిన ‘సింగీతం’….

Share

సినీ లోకంలో మూగబోయిన ‘సింగీతం’.
• విలక్షణ ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత.
• చెన్నైలో తుదిశ్వాస విడిచిన 94 ఏళ్ల దర్శక దిగ్గజం.
• ప్రముఖుల సంతాపం
చెన్నై, మహా .

భారత సినీ యవనికపై తన విలక్షణ ప్రయోగాలతో అజరామరమైన ముద్ర వేసిన దార్శనిక దర్శకుడు, లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సింగీతం శ్రీనివాసరావు (94) ఇకలేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రసీమలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 60కి పైగా ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెరకెక్కించి, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహనీయుడి నిష్క్రమణతో ఒక అద్భుత శకం ముగిసింది.
సింగీతం ప్రస్థానం భారతీయ సినీ చరిత్రలోనే ఒక అపురూప అధ్యాయం. ఎవర్ గ్రీన్ క్లాసిక్ ‘మాయాబజార్’ చిత్రానికి దిగ్గజ దర్శకుడు కె.వి. రెడ్డి వద్ద సహాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఆ తర్వాత స్వతంత్ర దర్శకుడిగా మారి భారతీయ సినిమా గమనాన్ని మలుపుతిప్పారు. సాంకేతికత, కంప్యూటర్ గ్రాఫిక్స్ అందుబాటులో లేని రోజుల్లోనే కేవలం తన సృజనాత్మక ప్రతిభతో అద్భుతాలను ఆవిష్కరించారు. మాటలు లేని మూకీ చిత్రంగా సంచలనం సృష్టించిన బ్లాక్ కామెడీ ‘పుష్పక విమానం’ (1987), భారతీయ సినిమాలోనే తొలి టైమ్-ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రికార్డు సృష్టించిన ‘ఆదిత్య 369’ (1991), నృత్యకారిణి సుధాచంద్రన్ నిజ జీవిత పోరాటం ఆధారంగా తెరకెక్కించిన స్ఫూర్తిదాయక కళాఖండం ‘మయూరి’ (1985) వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మేధస్సుకు నిదర్శనంగా నిలిచాయి. కమల్ హాసన్‌తో కలిసి ఆయన అందించిన ‘అపూర్వ సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ లాంటి చిత్రాలు అటు హాస్యాన్ని పండిస్తూనే, ఇటు వాణిజ్యపరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఆయన ప్రతిభకు ఎన్నో జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు, ఫిలింఫేర్ పురస్కారాలు దాసోహమన్నాయి.
వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, 94 ఏళ్ల పండు వయసులోనూ ఆయన మెగాఫోన్ పట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ‘సింగ్ గీతం’ అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి ఈ ఏడాది దర్శకత్వం వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం 77 రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసి, తనలోని దర్శకత్వ పదును ఏమాత్రం తగ్గలేదని చాటిచెప్పారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణనూ దక్కించుకుంది. బ్లాక్ అండ్ వైట్ నాటి ‘మాయాబజార్’ నుంచి 2026 నాటి ఆధునిక చిత్రం ‘సింగ్ గీతం’ వరకు ఆయన సాగించిన సినీ ప్రయాణం అరుదైనది, అనితరసాధ్యమైనది.
సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. ఆయన మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. “సింగీతం గారు నిజమైన దార్శనికుడు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి వంటి చిత్రాలు ఎన్ని తరాలు మారినా ఎప్పటికీ తాజాగా, అద్భుతంగానే అనిపిస్తాయి. ఆయన లేని లోటు పూడ్చలేనిది” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రయోగాత్మక చిత్రాలకు చిరునామాగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన దృశ్య కావ్యాల రూపంలో సినీ ప్రేమికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.