Mahaa Daily Exclusive

  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట దశను అధిగమించాం…..

Share

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో క్లిష్ట దశను అధిగమించాం.
• మే-జూన్ 2028 నాటికి పనులు పూర్తి చేసి నీరందిస్తాం.
• భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, మహా.
ఉమ్మడి నల్గొండ జిల్లా కలల ప్రాజెక్టు అయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. టన్నెల్ తవ్వకాల్లో అత్యంత ప్రమాదకరమైన ‘షియర్ జోన్’ను (భూగర్భంలో పెళుసుగా ఉండి విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతం) విజయవంతంగా దాటామని, ప్రస్తుతం పనులు వేగవంతంగా ముందుకు సాగుతున్నాయని ఆయన తెలిపారు. ఆదివారం సచివాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో మంత్రి ఉత్తమ్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ముఖ్యంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల స్థితిగతులపై ఆయన సమగ్రంగా చర్చించారు.
గత ఆరు నెలల కాలంలో సుమారు 700 మీటర్ల మేర సొరంగం తవ్వకాలను పూర్తి చేసి గణనీయమైన పురోగతి సాధించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అభినందించారు. టన్నెల్ అవుట్‌లెట్ వైపు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల మేర తవ్వకాలు పూర్తయ్యాయని వివరించారు. మొత్తం 43.96 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రధాన సొరంగంలో ఇప్పటికే సుమారు 79 శాతం పనులు పూర్తయ్యాయని, ఇంకా 9.1 కిలోమీటర్ల మేర మాత్రమే తవ్వకాలు మిగిలి ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రెండు వైపుల నుంచి రోజుకు సగటున 8 మీటర్ల చొప్పున తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు యంత్రాలను, అత్యాధునిక పరికరాలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. సొరంగంలో తవ్విన మట్టిని వేగంగా బయటకు తరలించేందుకు జర్మనీ నుంచి ప్రత్యేకంగా ఒక ‘లోకోమోటివ్’ (టన్నెల్ రైలు ఇంజిన్)ను ఆర్డర్ చేశామని, అది అక్టోబర్ నెలాఖరు నాటికి ఇక్కడికి చేరుకుంటుందని ఆయన చెప్పారు. 2028 మే-జూన్ నాటికి ప్రధాన టన్నెల్–1 అనుసంధాన పనులన్నింటినీ పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అనుకున్న సమయానికి, అంటే 2028 జూన్ నాటికి ఎస్‌ఎల్‌బీసీ ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోసి, దాదాపు 30 టీఎంసీలకు పైగా సాగు, తాగునీటిని ఉమ్మడి జిల్లా ప్రజలకు అందించడమే తమ అంతిమ ధ్యేయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్ఘాటించారు.