- అక్రమాల్లో గటికుడు
- నకిలీపత్రాలు సృష్టించిన బిజెపి జిల్లా కార్యదర్శి క్రాంతికుమార్
- రూ.67.20లక్షల మోసం కేసులో కటకటాలపాలు
- ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
- బాధితుల ఆక్రందనతో అడ్డంగా బుక్కవుతున్న వైనం
ఆదిలాబాద్, మహా
అక్రమాల్లో గటికుడు గటిక క్రాంతికుమార్ రూ.70లక్షల చీటింగ్ కేసులో కటకటాల పాలయ్యాడు. బిజెపి నేతలు అనేకమంది ఆరోపణల్లో చిక్కుతున్నారు. గటిక క్రాంతికుమార్ ఎమ్మెల్యే అండచూసుకుని చేస్తున్న అరాచకాలు, అక్రమాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. భాజపా జిల్లా ప్రధానకార్యదర్శిగా ఉన్న గటిక క్రాంతికుమార్ ఓ ప్లాట్ కు నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, ఆయన పేరునే రుణం తీసుకోవడంతో దారుణం బయటపడింది. ఆదివాసీ బాధితుడిని రూ.67.20లక్షలకు మోసం చేయడంతో పాటు ప్రశ్నించినందుకు చంపుతామని బెదిరించడంతో బాధితుడు బేర్ మంటూ పోలీసులను ఆశ్రయించిన దుస్థితి. డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఎల్బీ నగర్ లో ప్లాటు ఉందని మడావి గోపాల్ అనే వ్యక్తిని గటిక లక్ష్మణ్ స్వామి, గటిక క్రాంతికుమార్(భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి), తోకల నరేష్(ప్రస్తుత కౌన్సిలర్) నమ్మించారు. ఆ ప్లాటుకు నకిలీ పత్రాలు సృష్టించి ఖరీదుది పేరు రిజిస్ట్రేషన్ చేయించి ఆయన పేరుతోనే ఇంటి రుణం తీసుకున్నారు. ఈ మోసంపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షర్టుకు తెలియకుండా బనియన్ లాగేసినట్లు, ఇంటియాజమానికే తెలియకుండా ఆయన పేరునే రుణం తీయడం షాకింగ్ గా మారింది. ఇటీవల ఎమ్మెల్యే తన శ్రీమతి పేరున భూకబ్జా చేశారంటూ పత్రికల్లో కథనాలు రాగా, ఇంకా పలువురు బిజెపి కౌన్సిలర్లు, ఎమ్మెల్యే అండచూసుకుని రెచ్చిపోయే ఒకరిద్దరు అక్రమాలకు పాల్పడి ఇట్లే దొరికిపోతున్నారు. దీంతో ఆదిలాబాద్ బిజెపి నేతల దందాలు చూసి రాష్ట్రపార్టీ తలపట్టుకుంటోంది. కాగా అక్రమాల ఆరోపణలపై అరెస్టయిన నేతలకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ నేతల మూలంగా పార్టీ పరువుపోతోందంటూ ఇతర నేతలు ఆవేదన చెందుతున్నారు.
………..








