- సింగరేణి, కోల్ ఇండియా కార్మికులకు దీపావళి నజరానా
- 1,10,250 బోనస్ ప్రకటించిన యాజమాన్యం
- గతేడాది కంటే 7,250 రూపాయలు పెంపు
మంచిర్యాల, మహా : బొగ్గు పరిశ్రమ కార్మికులకు కోల్ ఇండియా యాజమాన్యం దీపావళి బోనస్ కానుక ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయల పీఎల్ఆర్ (పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు) బోనస్ చెల్లించనున్నట్లు శనివారం రాత్రి ప్రకటించింది. కోల్ కతాలోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బి. సాయిరాం అధ్యక్షతన జరిగిన జేబీసీసీఐ అపెక్స్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని ఉమ్మడిగా తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 3 గంటల వరకు సాగింది. ఈ సమావేశంలో కార్మిక ట్రేడ్ యూనియన్లు బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. యూనియన్లు ముందుగా 1.15 లక్షల రూపాయల నుంచి 1.20 లక్షల వరకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అయితే యాజమాన్యం మాత్రం లక్ష
8 వేల నుంచి 9,500 రూపాయల వరకే ఇస్తామని ప్రతిపాదించింది. చివరకు ఇరువర్గాల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం 1,10,250 రూపాయలకు అంగీకారం కుదిరింది. దీనికి కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా ఓకే చెప్పారు.
*2.37 లక్షల మందికి లబ్ధి*
ఈ బోనస్ తో దేశవ్యాప్తంగా 2.37 లక్షల మంది నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇందులో కోల్ ఇండియాలో 1.97 లక్షల మంది, మార్చి 2026 నాటికి సింగరేణిలో ఉన్న 40,300 మంది కార్మికులు ఉన్నారు. అలాగే ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 మధ్య రిటైర్ అయిన 8,351 మంది కోల్ ఇండియా ఉద్యోగులకు, 30 రోజులు పనిచేసిన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తిస్తుంది. గతేడాది 1,03,000 రూపాయల బోనస్ ఇవ్వగా, ఈసారి 7,250 రూపాయలు అదనంగా పెంచారు. ఇది దాదాపు 7 శాతం పెంపు. 2021-22లో రూ.76,500గా ఉన్న బోనస్, 2024-25 నాటికి 1.03 లక్షలకు చేరింది. ఇప్పుడు 1.10 లక్షలు దాటడం కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. సాధారణంగా కోల్ ఇండియా ఉద్యోగులకు దసరా పండుగ ముందు, సింగరేణి యాజమాన్యం దీపావళి ముందు బోనస్ చెల్లిస్తుంది. అక్టోబర్ 15లోపు చెల్లించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో యూనియన్ల నుంచి కె. లక్ష్మారెడ్డి (బీఎంఎస్), హర్భజన్ సింగ్ సిద్ధూ (హెచ్ఎంఎస్), డి.డి. రామానందన్ (సీఐటీయూ), లఖన్ లాల్ మహతో (ఏఐటీయూసీ), యాజమాన్యం తరపున మార్కెటింగ్ డైరెక్టర్, హెచ్ఆర్ డైరెక్టర్ ముకేశ్ చౌదరి, ఫైనాన్స్ డైరెక్టర్ ముకేశ్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్ (పా) గౌతం పొట్ల తదితరులు పాల్గొన్నారు.








