Mahaa Daily Exclusive

  పట్టణాభివృద్ధికి భారీ నిధులు….

Share

పట్టణాభివృద్ధికి భారీ నిధులు.
* రూ.5,912 కోట్లతో 14 ప్రాజెక్టులు
*అమరావతికి రూ.1,801 కోట్లు.
*’విజయవాడ వరద నియంత్రణకు రూ.600 కోట్లు.
*తిరుపతి, విశాఖతో పాటు కీలక నగరాలకు ఊతం.
* అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ మూడో దశకు ఆమోదం

అమరావతి, మహా:
రాష్ట్రంలోని పట్టణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.5,912 కోట్ల అంచనా వ్యయంతో 14 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ మూడో దశ కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అమరావతి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణ కేంద్రాల్లో వరద నియంత్రణ, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

అమరావతి ప్రాంతానికి రూ.1,801 కోట్లు

అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ పరిధిలోని 25 పట్టణాల్లో వరద నియంత్రణ, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి రూ.1,801 కోట్లు కేటాయించారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు వరద ముప్పును తగ్గించే చర్యలు చేపట్టనున్నారు.

తిరుపతి ప్రాంతంలో డ్రైనేజీకి ప్రాధాన్యం

తిరుపతి రీజియన్‌లోని 23 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించేందుకు రూ.1,231.65 కోట్లను కేటాయించారు. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మురుగునీటి పారుదల వ్యవస్థపై ఒత్తిడి పెరగకుండా అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు.

విశాఖలో 11 పట్టణాలకు ఊతం

విశాఖ రీజియన్‌లోని 11 పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు రూ.867 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. వర్షపు నీరు, మురుగునీరు సక్రమంగా వెళ్లేలా వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు పట్టణాల్లో నీటి నిల్వ సమస్యలను తగ్గించే చర్యలు చేపట్టనున్నారు.

విజయవాడ వరద నియంత్రణకు రూ.600 కోట్లు

విజయవాడ నగరంలో వరద నియంత్రణ చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భారీ వర్షాల సమయంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ, వరదనీటి పారుదల వ్యవస్థలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఇతర ప్రధాన నగరాలకూ ప్రాజెక్టులు

అమరావతి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడతో పాటు రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు నగరాల్లోనూ పలు పట్టణాభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పట్టణాల్లో పెరుగుతున్న జనాభా, మౌలిక వసతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు, డ్రైనేజీ, వరద నియంత్రణ వంటి రంగాల్లో అభివృద్ధి చేపట్టనున్నారు.

మొత్తంగా రూ.5,912 కోట్ల పెట్టుబడితో 14 ప్రాజెక్టులు అమల్లోకి రానుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి ఏడాది భారీ వర్షాల సమయంలో ఎదురయ్యే వరదలు, నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం కీలకం కానుంది.