Mahaa Daily Exclusive

  సేవే లక్ష్యంగా.. 2,600 వైద్య శిబిరాలు

Share

  • ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా సేవా కార్యక్రమాలు
  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

విజయవాడ

గన్నవరం.మహ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి 76వ జన్మదినం, 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానానికి గుర్తుగా ప్రాథమికంగా రాష్ట్రంలో 2,600 వైద్య శిబిరాలను ప్రారంభించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వ్యాధులను తొలిదశలోనే గుర్తించడం, అవసరమైన వారికి వైద్య సలహా, చికిత్స అందించడం, అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రాలకు పంపించి తదుపరి వైద్యం అందేలా చూడటమే ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. క్రమంగా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, చికిత్స అవసరమైన వారిని గుర్తించి నిరంతర వైద్య సంరక్షణ అందేలా చూడటానికి ఈ శిబిరాలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. మోదీ జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రజలకు సేవ చేయడం ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో భాగంగా రాష్ట్రంలో తొలి వైద్య శిబిరాన్ని గురువారం కృష్ణా జిల్లా గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ప్రారంభించి మాట్లాడారు.

దశలవారీగా 60 ఆసుపత్రుల ఉన్నతీకరణ

గ్రామస్థాయి నుంచే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా పేద కుటుంబాలకు వైద్య రక్షణ కల్పించడంతో పాటు వృద్ధులకు కూడా ఆరోగ్య భద్రతను విస్తరించారని చెప్పారు. గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం, అవసరమైన వారికి చికిత్స అందించడం, తదుపరి వైద్య సేవలను కొనసాగించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు మందులు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు.

రాష్ట్రంలో 60 ఆసుపత్రుల ఉన్నతీకరణకు ప్రతిపాదనలు అందాయని మంత్రి చెప్పారు. గన్నవరం ఏరియా ఆసుపత్రిలో వచ్చే బడ్జెట్‌లో ట్రామా కేర్‌, డయాలసిస్‌ కేంద్రం ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సేవా భావంతోనే జన్మదిన వేడుకలు

ప్రధానమంత్రి జన్మదిన వేడుకలను కేవలం ఉత్సవాలకు పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం మంచి సంప్రదాయమని మంత్రి అన్నారు. వైద్య శిబిరాలతో పాటు రక్తదానం, ఆరోగ్య అవగాహన, ఇతర ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం పనిచేయడమే నిజమైన ప్రజా సేవ అని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వాల సమన్వయంతో..

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో కలిసి కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

పేదల సంక్షేమమే ధ్యేయంగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో అడుగుపెట్టిన నాటి నుంచి పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి నేరుగా అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. పారదర్శక పాలనతో పాటు దేశ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని వివరించారు.

‘స్త్రీ శక్తి ‘ పథకంతో ఆసుపత్రుల్లో పెరిగిన ఓపీ

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కుటుంబాలను బలోపేతం చేయడానికి మార్గమని భావించి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, రుణ సదుపాయాల ద్వారా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి కనీస మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి ‘ పథకం (ఉచిత బస్సు ప్రయాణం) ద్వారా మహిళలకు అందుతున్న ప్రయోజనాలతో ఆసుపత్రుల్లో ఓపీ కూడా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు, ఎన్‌హెచ్‌ఎం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయలక్ష్మి, వైద్య శిబిరాల నిర్వహణ రాష్ట్ర పర్యవేక్షకుడు డాక్టర్‌ సతీష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.