Mahaa Daily Exclusive

  యూపీఐలో వ్యక్తుల మధ్య లావాదేవీలు పూర్తిగా ఉచితం….

Share

యూపీఐలో వ్యక్తుల మధ్య లావాదేవీలు పూర్తిగా ఉచితం.
*రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకూ ఛార్జీలు లేవు.. కేంద్రం కీలక ప్రకటన
*రూ.2,000 దాటితే ఎండీఆర్‌.. వినియోగదారుడిపై భారం మోపొద్దని ఆదేశం

న్యూఢిల్లీ, మహా:
యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. వ్యక్తుల మధ్య జరిగే పర్సన్‌ టు పర్సన్‌ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే ఉంటాయని తెలిపింది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎంత మొత్తాన్ని పంపినా ఎలాంటి లావాదేవీ ఛార్జీలు, దాచిన రుసుములు ఉండవని స్పష్టం చేసినట్లు సమాచారం.

వ్యక్తుల మధ్య బదిలీలకు ఎలాంటి రుసుము లేదు

యూపీఐ ద్వారా ఒక వ్యక్తి మరో వ్యక్తికి నగదు పంపే లావాదేవీలపై ఎలాంటి పరిమితి ఆధారిత ఛార్జీలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు డబ్బు పంపే సందర్భంలో వినియోగదారుల నుంచి లావాదేవీ రుసుము వసూలు చేయరాదని స్పష్టం చేసింది. దీంతో సాధారణ వినియోగదారులు యూపీఐని గతంలో మాదిరిగానే ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులకు ఊరట

వ్యాపార సంస్థలకు చేసే పర్సన్‌ టు మర్చంట్‌ చెల్లింపుల్లో రూ.2,000 వరకు ఎండీఆర్‌ రుసుము ఉండదని నిబంధనలు పేర్కొంటున్నాయి. చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే యూపీఐ క్యూఆర్‌ ద్వారా నెలకు రూ.లక్ష వరకు చెల్లింపులు స్వీకరించే చిన్న వీధి వ్యాపారులకు కూడా సున్నా ఎండీఆర్‌ మినహాయింపు వర్తిస్తుందని పేర్కొంది.

రూ.2,000 దాటితే ఎండీఆర్‌

రూ.2,000 కంటే ఎక్కువ విలువ కలిగిన సాధారణ వ్యాపారి లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) వర్తించే విధానం ఉంటుందని వివరించింది. ఈ రుసుముకు గరిష్ఠంగా రూ.300 వరకు పరిమితి ఉంటుందని పేర్కొంది.

అయితే రైల్వేలు, పెట్రోల్‌, బీమా వంటి ప్రత్యేక రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలకు శాతం ఆధారిత ఎండీఆర్‌ కాకుండా రూ.5 స్థిర రుసుము విధించే విధానం ఉంటుందని తెలిపింది.

భారం వినియోగదారుడిపై వేయొద్దు

యూపీఐ లావాదేవీలకు సంబంధించిన వ్యాపారి రుసుమును వినియోగదారులపైకి మళ్లించకుండా బ్యాంకులు, సంబంధిత సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం. యాప్‌ ప్రొవైడర్లు అదనపు ప్లాట్‌ఫామ్‌ ఫీజుల పేరుతో వినియోగదారులపై భారం మోపకూడదని కూడా పేర్కొంది.

డిజిటల్‌ చెల్లింపులకు మరింత ఊతం

యూపీఐ దేశంలో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో కీలకంగా మారిన నేపథ్యంలో.. చిన్న మొత్తాల లావాదేవీలపై అదనపు భారం లేకుండా చూడటం ద్వారా డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు సున్నా ఎండీఆర్‌ మినహాయింపులు డిజిటల్‌ చెల్లింపులను స్వీకరించేందుకు మరింత ప్రోత్సాహం కల్పించనున్నాయి.

అయితే వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ లావాదేవీలు ఉచితంగా ఉండటం, వ్యాపారి లావాదేవీలకు వర్తించే ఎండీఆర్‌ రెండూ వేర్వేరు అంశాలని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. వ్యాపారి చెల్లింపుల్లో రుసుము వర్తించే సందర్భాల్లోనూ ఆ భారాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేయకూడదన్నది ప్రభుత్వ ఆదేశాల ప్రధాన ఉద్దేశంగా ఉంది.