విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో కలిసి పనిచేద్దాం.
• తెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారం మరింత పెంచాలి: సీఎం రేవంత్‌రెడ్డి.
• ఫ్యూచర్ సిటీకి ఆగా ఖాన్ యూనివర్సిటీ.
• గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌కు ఆహ్వానం.
హైదరాబాద్, మహా:
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్–వి.తో తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.
వారసత్వ పరిరక్షణలో కీలక భాగస్వామ్యం
హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనం పునరుద్ధరణతో పాటు కుతుబ్‌షాహీ సమాధుల సముదాయం పునరుద్ధరణ చేపట్టిన విషయాన్ని వివరించారు.
మూసీ పునరుజ్జీవనంపై ప్రణాళికలు
హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికలను సీఎం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ రాత్రివేళల్లోనూ ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నది పరివాహక ప్రాంతంలోని చారిత్రక సిటీ కళాశాల, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణకు ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని కోరారు.
ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించి పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
ఫ్యూచర్ సిటీపై ఆగా ఖాన్ ఆసక్తి
డిసెంబరు 7 నుంచి 9 వరకు మూడు రోజులపాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్–విని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ ఆసక్తి కనబరిచి వివరాలు తెలుసుకున్నారు. సుమారు 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 20 నిమిషాల దూరంలో అభివృద్ధి చేస్తున్న ఈ నగరాన్ని పూర్తిగా నెట్-జీరో నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
పదిహేను వేల ఎకరాల్లో హరిత ప్రాంతం
సింగపూర్‌కు చెందిన సంస్థ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ప్రణాళికలో దాదాపు 15 వేల ఎకరాలను హరిత ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు ఫ్యూచర్ సిటీలో తమ కార్యకలాపాలను ప్రారంభించాయని గుర్తుచేశారు.
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వివరించారు.
ప్రపంచస్థాయి విద్యా సంస్థలకు ఆహ్వానం
ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలను సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు సమావేశంలో వివరించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించాయని తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా కోరారు. పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో తెలంగాణకు మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఉన్నతాధికారుల హాజరు
సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు, ఆగా ఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ వారసత్వ పరిరక్షణతో పాటు విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో భవిష్యత్తులో మరింత విస్తృత సహకారానికి ఈ భేటీ వేదికగా నిలిచింది.








