Mahaa Daily Exclusive

  బ్రిక్స్‌ ఎవరికీ వ్యతిరేకం కాదు….

Share

బ్రిక్స్‌ ఎవరికీ వ్యతిరేకం కాదు.
* అందరినీ కలుపుకుని ముందుకు సాగుతుంది.
* గ్లోబల్‌ సౌత్‌ ‘రూల్‌ టేకర్‌’ కాదు.. ‘రూల్‌ షేపర్‌’గా మారాలి.
* ప్రపంచ పాలనలో సంస్కరణలకు 10 సూత్రాల రోడ్‌మ్యాప్‌.
* ఐరాస భద్రతా మండలి సంస్కరణలు ఇక ఆలస్యం వద్దు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .

న్యూఢిల్లీ, మహా:

బ్రిక్స్‌ ఎవరికీ వ్యతిరేకమైన కూటమి కాదని, ప్రపంచంలోని అన్ని దేశాలను కలుపుకుని ముందుకు సాగే వేదిక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ పాలనా వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్‌ సౌత్‌ దేశాలు సంక్షోభాల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రపంచ నిర్ణయాల రూపకల్పనలో మాత్రం వాటి పాత్ర పరిమితంగానే ఉందని అన్నారు. ఈ పరిస్థితిని మార్చి అభివృద్ధి చెందుతున్న దేశాలను ‘రూల్‌ టేకర్స్‌’ నుంచి ‘రూల్‌ షేపర్స్‌’గా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో సభ్య దేశాల నేతలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధుల సమక్షంలో మోదీ ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తోపాటు ఇరాన్‌, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, మలేసియా, యూఏఈ, ఈజిప్టు, ఇథియోపియా, వియత్నాం దేశాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

బ్రిక్స్‌ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మోదీ ఈ వేదిక ప్రస్థానాన్ని ప్రస్తావించారు. “మనిషి జీవితంలో 20 ఏళ్లు పరిపక్వతకు నాంది పలికే దశ. బ్రిక్స్‌ కూడా 20 ఏళ్లలో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించింది” అని అన్నారు. పరస్పర గౌరవం, ఏకాభిప్రాయం, సహకార స్ఫూర్తితో బ్రిక్స్‌ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ప్రపంచ పాలనా వ్యవస్థలో సమూల మార్పుల కోసం పది సూత్రాలతో కూడిన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని మోదీ ప్రతిపాదించారు. ప్రపంచ వ్యవస్థను మరింత సమర్థంగా, బాధ్యతాయుతంగా, సమాన ప్రాతినిధ్యంతో తీర్చిదిద్దేందుకు ప్రాతినిధ్యం, స్పందనాత్మకత, నియమాల రూపకల్పన అనే మూడు ప్రధాన స్తంభాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై ఆలస్యం చేయకూడదని మోదీ స్పష్టం చేశారు. మారుతున్న ప్రపంచ ఆర్థిక, రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో ఓటింగ్‌ హక్కులు, నాయకత్వ స్థానాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటాను పెంచాలని సూచించారు.

కృత్రిమ మేధ, సైబర్‌ అంతరిక్షం, అంతరిక్ష పరిశోధనలు, జీవ సాంకేతిక రంగాల్లో భవిష్యత్‌ నియమాలు రూపొందించే సమయంలో గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రధాని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొద్దిమంది దేశాల ఆధిపత్యానికి పరిమితం కాకుండా.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేలా విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బ్రిక్స్‌లో అధ్యక్ష బాధ్యతలు మారినప్పటికీ గత నిర్ణయాలు, కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని మోదీ సూచించారు. దీనికోసం ట్రోయికా విధానాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఒకే చోట అందుబాటులో ఉంచే డిజిటల్‌ భాండాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. తద్వారా ప్రతి కొత్త అధ్యక్ష దేశం గత నిర్ణయాల నుంచి కొనసాగింపు సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.

సముద్ర రవాణా రంగంలోని సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు సముద్ర సిబ్బంది అత్యవసర సహాయ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా మోదీ ముందుకు తెచ్చారు. సముద్ర మార్గాలపై ఆధారపడే ప్రపంచ వాణిజ్యంలో నావికుల భద్రత, అత్యవసర సహాయం కూడా అంతర్జాతీయ సహకారంలో భాగం కావాలని ఆయన సూచించారు.

ఇదే సమయంలో బ్రిక్స్‌ వేదికపై ఆమోదం పొందిన న్యూఢిల్లీ సంయుక్త ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇరాన్‌, యూఏఈ మధ్య కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. భారత్‌ చర్చలు, సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కృషి చేసినట్లు సమాచారం. చివరకు సభ్య దేశాల మధ్య సమ్మతి సాధించి సంయుక్త ప్రకటనకు ఆమోదం లభించడం భారత అధ్యక్షతకు కీలక విజయంగా భావిస్తున్నారు.

ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇకపై ఇతరులు రూపొందించిన నియమాలను మాత్రమే అనుసరించే స్థితిలో ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి గ్లోబల్‌ సౌత్‌ ఎదగాలి.. అంతర్జాతీయ వ్యవస్థలో తమ స్వరాన్ని మాత్రమే వినిపించడం కాకుండా నియమాల రూపకల్పనలోనూ భాగస్వామ్యం కావాలి అని పిలుపునిచ్చారు.

ప్రపంచంలో విభేదాలు, ఘర్షణలు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్న సమయంలో బ్రిక్స్‌ మరింత బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. “బ్రిక్స్‌ ఎవరికీ వ్యతిరేకం కాదు.. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతుంది” అన్న సందేశంతో భారత దౌత్య విధానాన్ని మరోసారి స్పష్టం చేశారు.