Mahaa Daily Exclusive

  ఐరోపాను బెదిరించడం లేదు.. బెదిరించబోం.

Share

ఐరోపాను బెదిరించడం లేదు.. బెదిరించబోం.
• ఉక్రెయిన్‌లోకి యూరోప్‌ బలగాలు వస్తే.. రష్యాతో యుద్ధమే.
• ఐరోపాతో ఘర్షణకు మాకు కారణం లేదు.
• అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలి.
• రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.

న్యూఢిల్లీ, మహా:

ఐరోపా దేశాలను రష్యా బెదిరించడం లేదని, భవిష్యత్తులోనూ బెదిరించే ఉద్దేశం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఐరోపాతో ఘర్షణకు రష్యాకు ఎలాంటి కారణం లేదని పేర్కొన్నారు. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన పుతిన్‌.. రష్యా, ఐరోపా మధ్య సంబంధాలు, ఉక్రెయిన్‌ యుద్ధం, ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాల బలగాలను పంపే ప్రతిపాదనలపై తన వైఖరిని వెల్లడించారు.

“ఐరోపా దేశాలకు ఎలాంటి ముప్పు లేదు. ఎప్పుడూ అలాంటి ముప్పు లేదు. మేం ఐరోపా దేశాలను బెదిరించడం లేదు.. భవిష్యత్తులోనూ బెదిరించబోం. మేం ఎందుకు బెదిరిస్తాం?” అని పుతిన్‌ ప్రశ్నించారు. ఐరోపాతో రష్యాకు ఘర్షణ పడాల్సిన అవసరం లేదని, ఇరు పక్షాల మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థలో అప్పటి సమస్యలు పరిష్కారమయ్యాయని పుతిన్‌ వ్యాఖ్యానించారు. సోవియట్‌ యూనియన్‌ పతనం అనంతరం ఏర్పడిన పరిణామాలు కూడా రష్యన్‌ ఫెడరేషన్‌ సమ్మతితోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో కుదిరిన ఏర్పాట్లకు విరుద్ధంగా జరిగే చర్యలు రష్యా ప్రయోజనాలకు వ్యతిరేకమని, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా ఉండవని అన్నారు.

అయితే ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాలు తమ సైనిక బలగాలను పంపే అంశంపై పుతిన్‌ తీవ్ర హెచ్చరిక చేశారు. “ఉక్రెయిన్‌ భూభాగంలోకి బలగాలను పంపాలని ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. అలా చేస్తే అది రష్యాతో యుద్ధం ప్రారంభించినట్లే” అనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందించడం, ప్రత్యక్షంగా బలగాలను రంగంలోకి దించడం రెండూ వేర్వేరు అంశాలని రష్యా భావిస్తోందన్న సంకేతాలను ఆయన వ్యాఖ్యలు ఇచ్చాయి.

2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పుడు ఐదో ఏడాదిలోకి ప్రవేశించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా, ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు రాజకీయ, ఆర్థిక, సైనిక మద్దతు అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. శాంతి ఒప్పందంపై ఇప్పటికీ పూర్తిస్థాయి పరిష్కారం కనిపించలేదు.

బ్రిక్స్‌ వేదికగా పుతిన్‌ పాశ్చాత్య దేశాల ఆంక్షలపైనా తీవ్ర విమర్శలు చేశారు. బ్రిక్స్‌ ఏ దేశానికీ వ్యతిరేకంగా ఏర్పడిన వేదిక కాదని, సభ్య దేశాల ప్రయోజనాల కోసం పనిచేసే వేదికగా దాన్ని అభివర్ణించారు. పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆంక్షలను ఆర్థిక పోరాటంలో భాగంగా పేర్కొంటూ.. అవి ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని పుతిన్‌ మరోసారి స్పష్టం చేశారు. అదే సమయంలో ఐరోపా దేశాలతో నేరుగా ఘర్షణకు రష్యా సిద్ధంగా ఉందనే ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అయితే ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాల సైనిక బలగాలు ప్రవేశిస్తే దాన్ని మాత్రం రష్యా ప్రత్యక్ష సైనిక జోక్యంగా పరిగణిస్తుందని హెచ్చరించారు.