Mahaa Daily Exclusive

  ఆహార ప్యాకెట్లపై ఒకే హెచ్చరిక వద్దు….

Share

ఆహార ప్యాకెట్లపై ఒకే హెచ్చరిక వద్దు.
* సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.
* చక్కెర, ఉప్పు, కొవ్వు మొత్తాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
* ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి పలు ప్రశ్నలు.
* హెచ్చరిక లేబుల్‌ ఆకారం,స్థానం స్పష్టం చేయాలి.. పది రోజుల గడువు.

న్యూఢిల్లీ, మహా:
ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై పోషక విలువలకు సంబంధించిన హెచ్చరికలను ఒకే విధానంలో అమలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు సంధించింది. ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ప్రతిపాదించిన ఎర్ర రంగు ఆరు కోణాల హెచ్చరిక గుర్తుపై విచారణ సందర్భంగా చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి పోషకాలను విడివిడిగా కాకుండా వాటి మొత్తం పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై ధర్మాసనం దృష్టి సారించింది.

జస్టిస్‌ జె.బి. పార్దివాలా, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం విచారణలో ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో ప్రతిపాదించిన హెచ్చరిక విధానానికి సంబంధించి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి పలు ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా వినియోగదారులు, చిన్నారులు అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను సులభంగా గుర్తించేలా హెచ్చరిక విధానం ఉండాలని స్పష్టం చేసింది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రతిపాదన ప్రకారం ప్యాకేజీ ముందు భాగంలో ఎర్ర రంగు ఆరు కోణాల గుర్తులో ‘అధిక చక్కెర’, ‘అధిక ఉప్పు’, ‘అధిక కొవ్వు’, ‘అధికంగా తీపి చేసిన పానీయం’ వంటి హెచ్చరికలను ముద్రించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని రెండు దశల్లో అమలు చేయాలని ప్రతిపాదించారు. మొదటి దశలో చేర్చిన చక్కెర, చేర్చిన సంతృప్త కొవ్వు, ఉప్పు వంటి మూడు పోషకాలలో కనీసం రెండు నిర్ణీత పరిమితికి మించి ఉంటే హెచ్చరిక ఇవ్వాలన్నది ప్రతిపాదన. రెండో దశలో వీటిలో ఏ ఒక్కటి పరిమితికి మించినా హెచ్చరిక కనిపించేలా చేయాలనే ప్రతిపాదన ఉంది.

ఈ పరిమితులను భారత వైద్య పరిశోధన మండలి–జాతీయ పోషకాహార సంస్థ 2024లో విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా నిర్ణయించినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరించింది. ప్యాకెట్‌ వెనుక భాగంలో ఉండే పోషకాహార పట్టికతో పోలిస్తే హెచ్చరికకు కొంత పెద్ద అక్షర పరిమాణం ఉండేలా ప్రతిపాదించారు.

అయితే ఒకే తరహా హెచ్చరిక విధానంతో అన్ని ఉత్పత్తులను అంచనా వేయడం సరైనదేనా అన్న అంశాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చక్కెర, ఉప్పు, కొవ్వును ఆరోగ్యపరంగా కీలకమైన మూడు అంశాలుగా పరిగణిస్తున్నప్పటికీ.. కేవలం అదనంగా కలిపిన పదార్థాలనే కాకుండా ఉత్పత్తిలో ఉన్న మొత్తం చక్కెర, మొత్తం ఉప్పు, మొత్తం కొవ్వు పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం సూచించినట్లు తెలిసింది.

ఒక ఉత్పత్తిలో నిర్ణీత పరిమితికి మించి కేవలం ఒక్క పోషకం ఉన్నప్పుడు హెచ్చరిక నుంచి అది తప్పించుకునే అవకాశం ఉందన్న వాదన కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చింది. రెండు పోషకాలు అధికంగా ఉన్నప్పుడే హెచ్చరిక విధించే ప్రతిపాదన వల్ల వినియోగదారులకు పూర్తిస్థాయి సమాచారం అందకపోవచ్చన్న అంశాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విధానం వల్ల ఒక రకమైన ఖాళీ ఏర్పడే అవకాశం ఉందని వాదించారు.

అదే సమయంలో నెయ్యి, నూనె, బెల్లం, తేనె వంటి ఒకే ప్రధాన పదార్థంతో తయారయ్యే ఉత్పత్తులకు హెచ్చరిక నిబంధనల నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్నను కూడా ధర్మాసనం లేవనెత్తింది. పిల్లలు ఎక్కువగా తీసుకునే తీపి పదార్థాలు, ఇతర అనారోగ్యకరమైన ఆహార పదార్థాల విషయంలో తల్లిదండ్రులకు స్పష్టమైన సమాచారం ఎలా అందించాలన్న అంశంపైనా కోర్టు దృష్టి సారించింది.

హెచ్చరిక గుర్తు ఏ ఆకారంలో ఉండాలి, దాని పరిమాణం ఎంత ఉండాలి, ఏ రంగును ఉపయోగించాలి, ప్యాకెట్‌లో ఎక్కడ ముద్రించాలి, ఎప్పటి నుంచి అమలు చేయాలి వంటి అంశాలపై స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలను సమర్పించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి పది రోజుల సమయం ఇచ్చింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కేరళకు చెందిన ‘త్రీ ఎస్‌ అండ్‌ అవర్‌ హెల్త్‌ సొసైటీ’ 2024లో దాఖలు చేసింది. దేశంలో పెరుగుతున్న అనారోగ్యకరమైన ఆహార వినియోగం, ముఖ్యంగా చిన్నారుల్లో జంక్‌ ఫుడ్‌ అలవాట్ల నేపథ్యంలో ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలపై స్పష్టమైన ముందు భాగ హెచ్చరికలు ఉండాలని పిటిషన్‌లో కోరింది.

ఆహార ప్యాకెట్లపై హెచ్చరికల విషయంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించిందని సుప్రీంకోర్టు గుర్తించినప్పటికీ.. అమలు విధానం, పరిమితులు, హెచ్చరికల రూపకల్పనకు సంబంధించిన కొన్ని అంశాలు ఇంకా స్పష్టతకు రావాల్సి ఉందని పేర్కొంది. రాబోయే విచారణలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సమర్పించే వివరాల ఆధారంగా తదుపరి చర్యలను నిర్ణయించనుంది.