అసెంబ్లీకి వెళ్తుంటే యుద్ధ వాతావరణం సృష్టించారు.
* మహిళా ఎమ్మెల్యేల జుట్టు పట్టుకుని లాగారు.
* ఇది మహిళా లోకంపై దాడి.
* అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్–పోలీసుల ఘర్షణపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం.
దిల్లీ, మహా:
తెలంగాణ అసెంబ్లీకి ప్రజా సమస్యలపై చర్చించేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకుని యుద్ధ వాతావరణాన్ని సృష్టించారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా తమపై భౌతికంగా దురుసుగా వ్యవహరించారని, జుట్టు పట్టుకుని లాగారని ఆరోపించారు. ఇది తమపై జరిగిన దాడిగా చూడకూడదని, రాష్ట్రంలోని మహిళా లోకంపై జరిగిన దాడిగా భావించాలని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనను నిరసిస్తూ నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. గన్‌పార్క్ వద్ద నిరసన అనంతరం అసెంబ్లీ ప్రధాన గేటు వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్ల టీషర్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నినాదాలు, ఫ్లకార్డులతో వారు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సహా పలువురు బీఆర్‌ఎస్ నేతలు తమను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి తన జుట్టును పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి తన చీర కొంగును పోలీసులు లాగారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై సైఫాబాద్ పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి, ఘటనకు సంబంధించిన వాస్తవాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
దిల్లీలో మీడియాతో మాట్లాడిన సబితా ఇంద్రారెడ్డి.. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను గేటు వద్దే నిలువరించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలతో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అడ్డుకునేందుకే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
‘‘మహిళా ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని లాగారు. ఇది మాపై జరిగిన దాడి కాదు.. రాష్ట్రంలోని మహిళా లోకంపైనే జరిగిన దాడి’’ అని సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీకి ఎన్నికైన ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు.







