- పెన్షన్లు ఇవ్వలేరు కానీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తారా?
- ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై స్టే ఎత్తివేతకు నిరాకరణ!
హైదరాబాద్, మహా : ఉచిత సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై విధించిన తాత్కాలిక స్టేను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రజల పన్నుల డబ్బును ఉచిత పథకాలకు విచ్చలవిడిగా ఉపయోగించడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ ఉచిత పథకాలకు సంబంధించిన జీఓలకు చట్టబద్ధత లేదని గతంలోనే స్టే విధించింది. ఈ స్టేను వెకేట్ చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, స్టే ఎత్తివేసేందుకు సుముఖత చూపలేదు.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. “ఉచిత పథకాల వల్ల ప్రజాధనం భారీగా వృధా అవుతోంది” అని వ్యాఖ్యానించింది. ప్రజల నుంచి వసూలు చేసే పన్నుల సొమ్మును ఉత్పాదక రంగాలకు కాకుండా, కేవలం ఉచిత పథకాలకే దారబోయడం సరికాదని అభిప్రాయపడింది. పెన్షన్లు, భూనిర్వాసితుల పరిహారంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నిస్తూ హైకోర్టు పలు కీలక అంశాలను లేవనెత్తింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఇబ్బందులు: పదవీ విరమణ చేసిన ఎంతోమంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, ఇందుకోసం వారు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని కోర్టు గుర్తుచేసింది. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలు తరాల తరబడి ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయని, వారికి ఇవ్వాల్సిన చట్టబద్ధమైన పరిహారం కంటే ఉచిత పథకాలే ప్రభుత్వానికి ప్రాధాన్యతగా మారాయా? అని నిలదీసింది.
సెప్టెంబర్ 9 వరకు నిలిచిపోయిన నిధులు
ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఈ పథకాలకు సంబంధించిన నిధుల పంపిణీపై విధించిన స్టేను కోర్టు పొడిగించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కూడిన సమగ్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను సెప్టెంబర్ 9 కి వాయిదా వేసింది. ఫలితంగా అప్పటివరకు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఆర్థిక సాయం నిలిచిపోనుంది.







