Mahaa Daily Exclusive

  సామాన్యుడిలా బైక్‌పై కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సీపీ సర్‌ప్రైజ్‌ చెక్‌..! వన్‌వే ట్రాఫిక్‌ తీరును స్వయంగా పరిశీలించిన సజ్జనార్‌..

Share

  • కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సీపీ సర్‌ప్రైజ్‌ చెక్‌.
  • వన్‌వే ట్రాఫిక్‌ తీరును స్వయంగా పరిశీలించిన సజ్జనార్‌.
  •  జంక్షన్ల వద్ద పోలీసులను ఆరా.

హైదరాబాద్‌, మహా.

నగరంలో హెచ్‌-సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్‌ పార్క్‌ పరిసరాల్లో అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్వయంగా పరిశీలించారు. సామాన్యుడిలా బైక్‌పై ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ పరిస్థితిని క్షేత్రస్థాయిలో గమనించారు. రోడ్‌ నంబర్‌ 45 నుంచి ఫిల్మ్‌నగర్‌ వరకు బైక్‌పై రెండుసార్లు తిరుగుతూ వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నియంత్రణ తీరును పరిశీలించారు.

హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. దీంతో తొలిరోజు వాహనదారులు కొంత అయోమయానికి గురైనప్పటికీ, రెండో రోజు పరిస్థితి మెరుగుపడిందని సీపీ తెలిపారు.

జంక్షన్ల వద్ద పోలీసులతో ఆరా

బైక్‌పై పర్యటించిన సీపీ సజ్జనార్‌ పలు జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులతో మాట్లాడారు. వాహనాల రద్దీ ఎలా ఉంది? ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా? వాహనదారులకు మార్గదర్శనం ఎలా చేస్తున్నారు? వంటి అంశాలపై ఆరా తీశారు. మధ్యాహ్నం కూడా మరోసారి అదే మార్గంలో పర్యటించి ట్రాఫిక్‌ సరళిని పరిశీలించారు.

వన్‌వే మార్గాల్లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ప్రధాన జంక్షన్ల వద్ద స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్‌ తెలిపారు. అవసరమైన మేరకు ట్రాఫిక్‌ సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా ట్రాఫిక్‌ మళ్లింపులు, సిబ్బంది నియామకంపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

పనులు పూర్తయ్యే వరకు సహకరించాలి

హెచ్‌-సిటీ ప్రాజెక్టు నగర భవిష్యత్‌ ట్రాఫిక్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు అని సీపీ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ సమయంలో తాత్కాలికంగా ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు తప్పవని తెలిపారు. జీహెచ్‌ఎంసీ, నిర్మాణ సంస్థ, ట్రాఫిక్‌ పోలీసుల సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించడంతో పాటు వన్‌వే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.

సీపీ స్వయంగా బైక్‌పై రహదారులపైకి వచ్చి పరిస్థితిని పరిశీలించడం ట్రాఫిక్‌ నిర్వహణపై పోలీస్‌ శాఖ ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా నిలిచింది.