Mahaa Daily Exclusive

  రేగా కాంతారావుపై కేసు కొట్టివేత..! ఆధారాలు లేవన్న హైకోర్టు..

Share

  • రేగా కాంతారావుపై కేసు కొట్టివేత
  • ఆధారాలు లేవన్న హైకోర్టు
  • మాజీ ఎమ్మెల్యేకు భారీ ఊరట

హైదరాబాద్, మహా : బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ రేగా కాంతారావు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసింది.

యూట్యూబ్‌ ఛానల్‌ నిర్మాణం పేరుతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించారని ఓ యువతి రేగా కాంతారావుపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి తన ఫిర్యాదులో.. 2022లో ఇంటర్వ్యూ సందర్భంగా రేగా కాంతారావుతో పరిచయం ఏర్పడిందని, అనంతరం యూట్యూబ్‌ ఛానల్‌ ఏర్పాటు పేరుతో సన్నిహిత సంబంధం ఏర్పడిందని ఆరోపించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, వ్యక్తిగత విషయాలతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపింది.

హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు

తనపై నమోదైన ఆరోపణలను రేగా కాంతారావు ఖండించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కేసు నమోదు చేశారని పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు కేసులోని అంశాలను పరిశీలించి, సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. దీంతో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎమ్మెల్యేపై నమోదైన ఈ కేసు అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా హైకోర్టు నిర్ణయంతో రేగా కాంతారావుకు ఉపశమనం లభించినట్లైంది. రేగా కాంతారావు పినపాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలుత కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన ఆయన అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

Latest