• 89.9 శాతం సివిల్ పనులు పూర్తి.
• 36 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
అమరావతి, మహా.
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, ప్రాధాన్య క్రమంలో నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతితోపాటు రాష్ట్రంలోని 36 కీలక ప్రాజెక్టులను పూర్తి చేసే కార్యాచరణ, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో రాష్ట్రంలో లోటు వర్షపాతం పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, తాగునీటి సరఫరా, రిజర్వాయర్ల నిర్వహణ ప్రణాళిక, ‘జలధార–జలహారతి’ కార్యక్రమాల అమలు తీరుపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత నీటి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన పనులను కూడా నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాజెక్టు కీలక నిర్మాణాల్లో పనుల పురోగతి, రాబోయే దశల్లో చేపట్టాల్సిన పనులపై అధికారులు సీఎంకు వివరించారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 ప్రాంతాల్లోనూ నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. డ్యామ్ సైట్ వద్ద రహదారులు, ఇతర మౌలిక వసతుల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాల పనులు సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
పోలవరం సమీపంలోని గండి పోచమ్మ ఆలయ పరిరక్షణపైనా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆలయాన్ని కాపాడుతూ స్థానికుల సెంటిమెంట్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులతోపాటు స్థానిక ప్రజల విశ్వాసాలు, ఆధ్యాత్మిక భావాలను గౌరవించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇటీవల గోదావరిలో 14 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహం వచ్చినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలగకుండా కొనసాగించామని అధికారులు సీఎంకు వివరించారు. భారీ వరద పరిస్థితుల్లోనూ నిర్మాణ పనులను నిర్వహించిన తీరు, ప్రాజెక్టు వద్ద తీసుకున్న భద్రతా చర్యల గురించి సమావేశంలో వివరించారు.
వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాల్సిన 36 ప్రాజెక్టుల పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తితో ఆయా ప్రాంతాల్లో సాగునీటి లభ్యత పెరగడంతోపాటు తాగునీటి అవసరాలను కూడా తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
రాష్ట్రంలో రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వివిధ ప్రాంతాలకు విడుదల చేస్తున్న నీరు, భవిష్యత్ అవసరాలు, వర్షపాతం పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమగ్ర నీటి నిర్వహణ ప్రణాళికను అమలు చేయాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంతోపాటు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలవరం, వెలిగొండతోపాటు ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువుల్లో లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.








