• 3.38 కోట్లకు తేలిన ఓటర్లు.
• 73.95 లక్షల ఓట్ల తొలగింపు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గణన ప్రక్రియ పూర్తికాగా.. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. గణన సందర్భంగా 73,95,954 మంది ఓటర్ల పేర్లు తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 గణన పత్రాలను డిజిటలీకరించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం డిజిటలీకరణ పూర్తయింది.
జిల్లాల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా డిజిటలీకరణలో అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 94.30 శాతం గణన పత్రాల డిజిటలీకరణ పూర్తయింది. మెదక్ జిల్లాలో 90.54 శాతం, సూర్యాపేటలో 90.43 శాతం నమోదైంది. కుమురం భీమ్ ఆసిఫాబాద్లో 89.45 శాతం, జగిత్యాలలో 89.60 శాతం ప్రక్రియ పూర్తయింది.
హైదరాబాద్లో మందగించిన ప్రక్రియ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మాత్రం డిజిటలీకరణ ప్రక్రియ మందకొడిగా సాగింది. జిల్లాలో 27,74,687 ఓట్లు ఉండగా.. కేవలం 58.58 శాతం గణన పత్రాలే డిజిటలీకరణ పూర్తయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో హైదరాబాద్ రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. మేడ్చల్–మల్కాజిగిరిలో 63.82 శాతం, రంగారెడ్డిలో 64.91 శాతం నమోదైంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో డిజిటలీకరణకు రెండుసార్లు గడువు పొడిగించినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధిక జనాభా, భారీ సంఖ్యలో ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో గణన ప్రక్రియకు ఎదురైన ఇబ్బందులు ఇందుకు కారణాలుగా అధికారులు భావిస్తున్నారు.
తొలగించిన ఓట్లపై అభ్యంతరాలకు అవకాశం
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించిన నేపథ్యంలో.. ముసాయిదా జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు, దావాలకు అవకాశం కల్పించనున్నారు. గణనలో తమ పేరు లేకపోవడం లేదా అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితా నుంచి తొలగించినట్లు గుర్తిస్తే సంబంధిత వ్యక్తులు నిర్ణీత ప్రక్రియ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు.
రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు ఈ నెల 12న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనంతరం ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
నెల రోజుల పాటు అభ్యంతరాల స్వీకరణ
ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత నెల రోజులపాటు అభ్యంతరాలు, దావాలను స్వీకరించే ప్రక్రియ కొనసాగనుంది. ఈ సమయంలో ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయా? లేక తొలగించారా? అన్నది పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. అభ్యంతరాల పరిశీలన, పరిష్కారం అనంతరం తుది జాబితాను రూపొందించనున్నారు.
అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. దీంతో రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికానుంది.
రాష్ట్రవ్యాప్తంగా 73.95 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు తొలగించినట్లు వెలువడిన గణాంకాల నేపథ్యంలో.. ముసాయిదా జాబితా విడుదల తర్వాత జరిగే అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ అత్యంత కీలకంగా మారనుంది. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చూడటంతోపాటు.. అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియ పారదర్శకంగా జరగాల్సిన బాధ్యత ఎన్నికల యంత్రాంగంపై ఉంది.








