Mahaa Daily Exclusive

  సంగారెడ్డికి రేవంత్..! స్మార్ట్ కార్డుల పంపిణీ..15న సీఎం పర్యటన..భారీ సభకు ఏర్పాట్లు..

Share

సంగారెడ్డి, మహా.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సోమవారం తారా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్‌ను, అంబేద్కర్‌ స్టేడియంలోని సభా ప్రాంగణాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ పరిశీలించారు.

సభా ప్రాంగణం, హెలిప్యాడ్‌ వద్ద భద్రత, పార్కింగ్‌, ప్రజల రాకపోకలు, వేదిక ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది.

అనంతరం జగ్గారెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు అరకొరగా రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రజలకు పెద్దఎత్తున స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఐదు లక్షల మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు.

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై కమిట్‌మెంట్‌తో పనిచేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

సంగారెడ్డిలో నిర్వహించనున్న కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమమే అయినప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఘన స్వాగతం పలుకుతామని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అంబేద్కర్‌ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. సుమారు 50 వేల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి రాకపోకలు, ట్రాఫిక్‌ నిర్వహణ, పార్కింగ్‌ ప్రాంతాలు, సభకు వచ్చే ప్రజల భద్రత వంటి అంశాలపై అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.