రేవంత్ క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారు.
• రైతులపై సీఎంకు కనీస పరిజ్ఞానం లేదు.
• పంప్‌లు ఎందుకు ఆన్ చేయలేదు?
• బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.
హైదరాబాద్, మహా.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమకు క్షుద్ర రాజకీయాలు తెలియవని, క్షుద్ర పూజల పేరుతో కాంగ్రెస్ నేతలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మాజీ మంత్రి హరీశ్‌రావు గుడికి వెళ్లడమే తప్పా? అని ప్రశ్నించారు. తమకు స్ట్రెయిట్ రాజకీయాలు మాత్రమే తెలుసని స్పష్టం చేశారు.
రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కనీస అవగాహన లేదని కేటీఆర్ విమర్శించారు. తాము డిమాండ్ చేసిన తర్వాతే పంప్‌లు ఎందుకు ఆన్ చేశారని ప్రశ్నించారు. ఎప్పుడు నీటిని ఎత్తిపోసుకోవాలో కూడా సీఎంకు తెలియదని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు ఈ అంశంపై ప్రశ్నించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి దృష్టిలో భూమి అంటే రియల్ ఎస్టేట్ మాత్రమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతులు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. కృష్ణా జలాల అంశంలో కీలకమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని అంశాలతో పాటు గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఎజెండాలో ఏడు వివాదాస్పద అంశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆయన విమర్శించారు.








