Mahaa Daily Exclusive

  విజయ డైరీ ఛైర్మన్‌ పదవిపై టీడీపీలో పోటీ…

Share

విజయ డైరీ ఛైర్మన్‌ పదవిపై టీడీపీలో పోటీ.
• పలువురు ఎమ్మెల్యేల నుంచి పేర్ల ప్రతిపాదనలు.
• ఎంపికను వారం రోజులు వాయిదా?
విజయవాడ, మహా.

విజయ డైరీ ఛైర్మన్‌ పదవి టీడీపీలో కొత్త చర్చకు దారితీస్తోంది. కీలకమైన ఈ పదవిని తమకు అనుకూలమైన వ్యక్తులకు కట్టబెట్టాలంటూ పలువురు ఎమ్మెల్యేలు పేర్లను ప్రతిపాదించడంతో పార్టీలో పోటీ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చలసాని రాజీనామా వ్యవహారంతో విజయ డైరీ అంశం రాజకీయంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో.. తాజాగా ఛైర్మన్‌ ఎంపిక వ్యవహారం కూడా టీడీపీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

విజయ డైరీ ఛైర్మన్‌ పదవి కోసం పలువురు పేర్లు తెరపైకి వచ్చినట్లు సమాచారం. పాలడుగు నానికి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అర్జా నగేష్‌ పేరును ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ సూచించినట్లు సమాచారం. మరోవైపు డైరెక్టర్‌గా ఉన్న చక్రవర్తికి ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించాలని మరో ఎమ్మెల్యే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో మహిళా డైరెక్టర్‌కు అవకాశం కల్పించాలని ఇంకొక ఎమ్మెల్యే సూచించినట్లు సమాచారం.

ఒకే పదవి కోసం పలువురు పేర్లు ప్రతిపాదించడంతో ఛైర్మన్‌ ఎంపిక వ్యవహారం టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చలసాని రాజీనామా అంశం పార్టీలో చర్చకు దారితీసిన నేపథ్యంలో.. కొత్త ఛైర్మన్‌ ఎంపిక సమయంలో ఎలాంటి విభేదాలు బయటపడకుండా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో విజయ డైరీ ఛైర్మన్‌ ఎంపికను వారం రోజుల పాటు వాయిదా వేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయంతో కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేలా చూడాలని మంత్రి కొల్లు రవీంద్రకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు సూచించిన పేర్లపై చర్చించి, అందరినీ సమన్వయం చేస్తూ ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో వారం రోజుల తర్వాత విజయ డైరీ కొత్త ఛైర్మన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారన్నది విజయవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుంది? ఎమ్మెల్యేల ప్రతిపాదనల్లో ఏ పేరుకు ఆమోదం లభిస్తుంది? అన్నది ఉత్కంఠగా మారింది.