ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్.
• సూసైడ్ నోట్ ఎక్కడుందో తెలియదన్న ఉదయ్.
• మాయమైన ఐఫోన్‌పై పోలీసుల దృష్టి
హైదరాబాద్, మహా.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. సూసైడ్ నోట్ వ్యవహారంపై సీపీ సీవీ సజ్జనార్ ప్రశ్నించగా, మద్యం మత్తులోనే ఆ నోట్ రాసినట్లు ఉదయ్ చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఆ సూసైడ్ నోట్ ఎక్కడ ఉందో తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అసలు సూసైడ్ నోట్ ఎక్కడికి వెళ్లింది? అది ఎలా బయటకు వచ్చింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాను రాసిన సూసైడ్ నోట్‌లో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఆధారాలను ఐఫోన్‌లో భద్రపరిచినట్లు ఉదయ్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే ఆ ఐఫోన్ కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్ మాయమైన వ్యవహారంపైనా దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్ ఎలా బయటకొచ్చింది?
సూసైడ్ నోట్ తన వద్ద లేదని ఉదయ్ చెబుతున్న నేపథ్యంలో అది మీడియాకు ఎలా చేరిందన్నది పోలీసులకు కీలక ప్రశ్నగా మారింది. ఈ విషయంపై సీపీ సజ్జనార్ ప్రశ్నించినప్పటికీ ఉదయ్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని సమాచారం. దీంతో సూసైడ్ నోట్ వ్యవహారం ముందస్తు ప్రణాళికలో భాగమా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాన్ని బయటకు తీసుకొచ్చారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక ఆరోపణలకు సంబంధించి కేసు నమోదైన మరుసటి రోజే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధిక మోతాదులో మద్యం సేవించడంతో ఆయన ఎక్కువ సమయం మత్తులో ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు సమాచారం.
మరో ఇద్దరు మహిళలతో సంబంధాలపై ఆరా
కేసు దర్యాప్తులో భాగంగా ఉదయ్‌కు మరో ఇద్దరు మహిళలతోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన సోదరుడి పాత్రపైనా దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. టెక్నికల్ ఆధారాల ఆధారంగా అతడిని కూడా కేసులో నిందితుడిగా చేర్చే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సూసైడ్ నోట్ నిజంగానే ఉదయ్ రాశారా? రాస్తే అది ఎవరి చేతికి వెళ్లింది? మీడియాకు ఎలా చేరింది? ఐఫోన్ ఎక్కడికి వెళ్లింది? ఈ వ్యవహారంలో మరెవరైనా పాత్ర ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ అంశాలపై మరింత లోతుగా విచారించేందుకు ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు సూసైడ్ నోట్ వ్యవహారంలో ఎవరి పాత్రపై అయినా తుది నిర్ధారణకు రావడం సరికాదని పోలీసులు భావిస్తున్నారు.








