‘రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్’ ఆఫర్లతో సైబర్ వల.
• అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా కొత్త డేటింగ్ ట్రాప్.
• ఆకర్షణీయమైన పోస్టర్లను నమ్మొద్దు: సీపీ సజ్జనార్ హెచ్చరిక.
హైదరాబాద్, మహా.
సోషల్ మీడియాలో ‘రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్’ పేరుతో కనిపిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక భారీ సైబర్ మోసం దాగి ఉండొచ్చని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా అమ్మాయిలు, యువతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా డేటింగ్ ట్రాప్‌కు తెరతీశారని అప్రమత్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న ఇలాంటి ప్రకటనలను నమ్మి అపరిచితులతో పరిచయం పెంచుకోవద్దని సూచించారు.
‘ఒంటరిగా ఉన్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకు వెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అదీ 50 శాతం డిస్కౌంట్‌తో’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పోస్టర్లపై సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ‘రెంట్ బాయ్‌ఫ్రెండ్–యువర్ పర్సనల్ కంపానియన్’ పేరుతో ఆకర్షణీయమైన ప్యాకేజీలను ప్రకటిస్తూ యువతులను వలలోకి లాగుతున్నారని తెలిపారు.
కాఫీ మీటింగ్‌కు రూ.499, సినిమా డేట్‌కు రూ.1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి రూ.1,499, ఈవెంట్లు, పెళ్లిళ్లకు రూ.1,999, 10 గంటల ఫుల్డే ప్యాకేజీకి రూ.4,499 అంటూ ధరల పట్టికలను సైతం సైబర్ కేటుగాళ్లు రూపొందిస్తున్నారని వివరించారు. గోప్యత, భద్రతకు పూర్తి హామీ ఇస్తామని నమ్మబలుకుతూ ముందుగా డైరెక్ట్ మెసేజ్ ద్వారా సంప్రదించాలని కోరుతున్నారని తెలిపారు.
ఆ తర్వాత ఏఐ ద్వారా సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువకుల ఫొటోలను ప్రొఫైల్ చిత్రాలుగా పెట్టి బాధితులతో పరిచయం పెంచుకుంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. మధురమైన మాటలతో నమ్మకం కలిగించిన అనంతరం బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ చెల్లింపు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు తీసుకున్న తర్వాత అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారని హెచ్చరించారు.
ఇలాంటి వ్యక్తులను నమ్మి నేరుగా కలవడానికి వెళ్లడం మరింత ప్రమాదకరమని సీపీ సూచించారు. ప్రేమ, స్నేహం పేరుతో మోసం చేయడంతో పాటు చాటింగ్ సమయంలో సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు, ఫొటోలను ఉపయోగించి అనంతరం బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల నిజమైన గుర్తింపు తెలియకుండా వారిని కలవడం ద్వారా మరిన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించిందని సజ్జనార్ తెలిపారు. అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు, ప్రకటనలు, డిజిటల్ చెల్లింపులపై నిఘా కొనసాగుతోందని, నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అమ్మాయిలు, యువతులతో పాటు తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకటనలు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎలాంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటున్నారు? అనే విషయాలపై తల్లిదండ్రులు అవగాహనతో పర్యవేక్షణ చేయాలని సూచించారు. అయితే పిల్లల వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తూనే సైబర్ భద్రతపై వారితో నిరంతరం చర్చించడం అవసరమని పేర్కొన్నారు.
ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లకు తొందరపడి స్పందించవద్దని, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు పంచుకోవద్దని, నేరుగా కలవడానికి వెళ్లవద్దని, ముందస్తుగా ఎలాంటి డబ్బు చెల్లించవద్దని సజ్జనార్ సూచించారు. అనుమానాస్పద పోస్టు కనిపించినా, మోసానికి గురైనా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.








