Mahaa Daily Exclusive

  చంద్రబాబు పాలనపై ప్రజల్లో సంతృప్తి….

Share

చంద్రబాబు పాలనపై ప్రజల్లో సంతృప్తి.
• అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు.
• 2029లో వైసీపీ గ్రాఫ్‌ జీరోకు పడిపోవడం ఖాయం.
* మంత్రి నారాయణ

నెల్లూరు, మహా.

రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సంతోషంగా ఉన్నారని టీడీపీ మంత్రి నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సుపరిపాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి లభిస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు ఓర్వలేక అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాకారం కావడాన్ని కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయుల కుటుంబాల్లో ప్రభుత్వం కల్పించిన ఆనందాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి వైసీపీ నేతలు అసహనంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి తీరు ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో వైసీపీ గ్రాఫ్‌ సున్నా స్థాయికి పడిపోవడం ఖాయమని నారాయణ వ్యాఖ్యానించారు.

సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సుమారు 60 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయబోమని స్పష్టం చేశారు. భగత్‌సింగ్‌ కాలనీ తరహాలో అర్హులైన వారికి శాశ్వత ఇంటి పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని నారాయణ చెప్పారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.