పోలీసు విధుల్లో ఓర్పు, సహానుభూతి అత్యంత ఆవశ్యకం.
• బాధితుల సమస్యలను ఓపికగా విని భరోసా కల్పించాలి.
* బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.
* 5,560 మంది ట్రైనీ కానిస్టేబుళ్లకు మానసిక ఒత్తిడి నిర్వహణపై దిశానిర్దేశం
కాకినాడ, మహా.
పోలీసు విధుల్లో మానసిక ఒత్తిడి సహజమేనని, అయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజల పట్ల ఓర్పు, సహానుభూతితో వ్యవహరించడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. బాధితులు ఎన్నో కష్టాలు, ఆవేదనలతో న్యాయం కోసం పోలీస్‌స్టేషన్లకు వస్తారని, వారి సమస్యలను ఓపికగా విని మానవీయంగా స్పందించినప్పుడే పోలీసులపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లకు మానసిక ఒత్తిడి నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయం వేదికగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శిక్షణా కేంద్రాల్లోని ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి చాగంటి కోటేశ్వరరావు ప్రసంగించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు అవసరమైన పలు సూచనలు చేశారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనం, కోపం ప్రదర్శించకూడదని చాగంటి సూచించారు. ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల పరిస్థితిని అర్థం చేసుకుని వారికి న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలని అన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, ఓర్పు, సహానుభూతి వంటి సద్గుణాలు పోలీసు విధుల్లో అత్యంత కీలకమని పేర్కొన్నారు.
పోలీసులు మానసిక ప్రశాంతతను కాపాడుకునేందుకు పుస్తక పఠనాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ గురవారెడ్డి రచించిన ‘గురవాయణం’తో పాటు చిలకమర్తి లక్ష్మీనరసింహం, జంధ్యాల తదితరుల హాస్య రచనలు చదవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. విధి ఒత్తిడితో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 21 పోలీసు శిక్షణా కళాశాలల నుంచి సుమారు 5,560 మంది సివిల్, ఏపీఎస్పీ ఎస్‌సీటీపీసీ ట్రైనీ కానిస్టేబుళ్లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శిక్షణ ఐజీ అంబురాజన్ ఐపీఎస్, ఏఐజీ ట్రైనింగ్ సత్తిబాబు ఐపీఎస్, పలువురు శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్లు, కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, అదనపు ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్‌కుమార్, కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్ కె. నవీన్‌కుమార్, అదనపు కమాండెంట్ ఎస్. దేవానందరావు, ఎస్‌బీ డీఎస్పీ కె.వీ.వీ. సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలని, బాధితులకు అండగా నిలిచి పోలీసుశాఖపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేలా వ్యవహరించాలని చాగంటి కోటేశ్వరరావు సూచించారు.








