- కాంగ్రెస్ ‘6 గ్యారెంటీలు’ గాలికి
- కొత్తగా ‘6 సీ’ లతో దోపిడీ
- బిజెపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. విమర్శ
హైదరాబాద్, మహా : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తయినా పరిపాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైందని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ ఆరోపించారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా గాడి తప్పిందని, ఖజానా ఖాళీ అయి కొత్తగా అప్పు కూడా పుట్టని దయనీయ స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా గాలికి వదిలేసిందని, ప్రజలు వాటిని మర్చిపోయేలా కొత్తగా ‘6 సీల’ దోపిడీ పాలనను సాగిస్తోందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
ప్రజాసంక్షేమాన్ని పక్కనబెట్టి దోచుకోవడం, దాచుకోవడం, ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజుకూ ప్రభుత్వ అప్పులు పెరిగిపోతుంటే, ప్రభుత్వ ఆస్తులు మాత్రం తరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ మంత్రుల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయని, అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు వందల కోట్ల అప్పును నిమిషాల వ్యవధిలో చెల్లించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రులకు కప్పం కడితేనే పదవులు పదిలంగా ఉండే పరిస్థితి దాపరించిందన్నారు.
40 సార్లు అధికారుల మార్పు – ఐఏఎస్, ఐపిఎస్లపై వేధింపులు
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై అస్సలు పట్టు లేదని, రెండున్నరేళ్ల కాలంలోనే 40 సార్లకు పైగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారని ప్రభాకర్ అన్నారు. తమ అక్రమాలకు తలొగ్గని అధికారులను బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య సఖ్యత, సమన్వయం లేకపోవడంతో గొడవలు బయటపడతాయనే భయంతోనే మంత్రివర్గ విస్తరణ చేయడం లేదన్నారు. ముఖ్యమంత్రి పరిధిలోనే విద్యాశాఖ ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో రోజుకో చోట పిల్లలు ‘ఫుడ్ పాయిజన్’ బారిన పడుతున్నారని, దీనికి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
అవినీతి కేసుల్లో తెలంగాణ అధికారులే టాప్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో తెలంగాణ అధికారులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని ప్రభాకర్ తెలిపారు. కేవలం గత ఏప్రిల్ నుంచి జూన్ మధ్య (మూడు నెలల్లోనే) ఏసీబీ 67 కేసులు నమోదు చేసిందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. ఏసీబీకి పట్టుబడిన అధికారుల నుంచి మంత్రులు మళ్లీ వసూళ్లకు దిగి, విచారణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఎన్.వి.ఎస్.ఎస్. తీవ్రంగా ఆరోపించారు.
బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ నాటకాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తాం, నిధులు కక్కిస్తాం అని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఆ విచారణలన్నింటినీ తొక్కిపెట్టిందని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసుల విచారణలను నీరుగార్చారని, బిఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ ఒకే నాణేనికి బొమ్మ-బొరుసని స్పష్టమవుతోందన్నారు. మొత్తానికి అన్ని రంగాల్లో దారుణంగా విఫలమై ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రతి మండలంలోనూ బిజెపి శ్రేణులు వెంటాడి, వేటాడి నిలదీస్తాయని ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ స్పష్టం చేశారు.








